ఒడిశా రాష్ట్రవ్యాప్తంగా మహిళల కోసం ప్రత్యేకంగా 3 రోజుల పాటు 'రజా పర్బ' నిర్వహిస్తున్నారు. ఈ మూడు రోజులు మహిళలను దేవతల్లా ఆరాధిస్తారు. అలాగే వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రకృతికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సోమవారం ఈ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.
అసలు ఎందుకు చేస్తున్నారు?
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భూమాత.. భవిష్యత్ వ్యవసాయ కార్యకలాపాలకు తనను తాను సిద్ధం చేసుకుంటుందని నమ్ముతారు అక్కడి ప్రజలు. దీంతో నేల సారవంతంగా మారి పంటలు వేయడానికి అనుకూలంగా మారుతుందని భావిస్తారని ఒడిశా పర్యటక అభివృద్ధి సంస్థ(ఓటీడీసీ) ఛైర్పర్సన్ ఎస్ మిశ్రా తెలిపారు. అందుకే పిండి వంటలు, కాలానుగుణంగా లభించే పళ్లను నైవేద్యంగా పెట్టి భూమాతకు ప్రత్యేక పూజలు చేస్తారు ఒడిశా వాసులు. ఈ పండగ ఒడిశాలోని వ్యవసాయ పనులు ప్రారంభానికి సూచనగా చెప్పొచ్చు. జూన్ మధ్యలో రుతుపవనాల రాష్ట్రంలో ప్రవేశించి.. తొలకరి జల్లులు కురుస్తాయి. దీంతో అప్పటివరకు ఎండిన నేల తేమగా మారుతుంది. దీంతో పంటలు వేయడానికి సిద్ధమవుతుంది.
పితా ఆన్ వీల్స్ కార్యక్రమం
మాములు పండగలా.. పిండి వంటలు తయారు చేస్తారు. వివిధ కేకులతో (పితాస్) ఈ పండగ జరుపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆదివారం 'పితా ఆన్ వీల్స్' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఓటీడీసీ. ఈ వాహనంపై పొదా పితా, మండా, కకరా, అరిశా, ఛకులీ, చంద్రకళ వంటి పిండి వంటలు, కేకులను భువనేశ్వర్, కటక్, సంబల్పుర్ ప్రాంతాల్లో విక్రయిస్తారని మిశ్రా తెలిపారు.
![Festival celebrating womanhood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12128299_619_12128299_1623670309569.png)
![Festival celebrating womanhood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12128299_4.jpg)
అందంగా ముస్తాబై..
అలాగే ఆ మూడు రోజుల పాటు మహిళలు ఎలాంటి ఇంటి పనులు చేయరు. చేతులకు గోరింట, కాళ్లకు పారాణి పెట్టుకుంటారు. కొత్త చీరలు కట్టుకుని అందంగా ముస్తాబై ఆట పాటలతో కోలాహలంగా గడుపుతారు. అయితే ఈసారి కరోనా కారణంగా తక్కువ మందితో ఈ వేడుకలు జరుపుకుంటున్నారు.
![Festival celebrating womanhood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12128299_1.jpg)
![Festival celebrating womanhood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12128299_2.jpg)
రజా అంటే..
రజా అనే పదం రజస్వలా నుంచి వచ్చింది. దీనికి రుతుస్రావం అయిన మహిళ అని అర్థం. మధ్యయుగ కాలంలో ఈ పండుగ వ్యవసాయ సెలవు దినంగా ప్రాచుర్యం పొందింది. ఇది జగన్నాథ స్వామి భార్య అయిన భూదేవి ఆరాధనను గుర్తుచేస్తుంది. పూరి ఆలయంలో భూదేవి వెండి విగ్రహం జగన్నాథ స్వామి పక్కన ఇప్పటికీ ఉంది.
ఇదీ చూడండి: Viral: ధూమ్ సినిమాను తలపించేలా చోరీ