కరోనా మహమ్మారి నేపథ్యంలో స్టేషన్లలో రద్దీ తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది భారతీయ రైల్వే. కీలక రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్ టికెట్ ధరలు పెంచుతూ ఆదేశాలు జారీచేసింది.
పలు స్టేషన్లలో 3 నుంచి 5 రెట్లు టికెట్ రుసుం పెరిగింది. కొన్ని స్టేషన్లలో రూ.10 నుంచి రూ.30కి పెరగగా.. ముంబయి మెట్రోపాలిటన్ ప్రాంతంలోని కొన్ని ముఖ్య స్టేషన్లలో రూ.50 వసూలు చేయనున్నారు. క్షేత్రస్థాయిలో నిర్వహణ అవసరాలకు అనుగుణంగా ఈ ధరలను మార్చే అధికారాన్ని ప్రాంతీయ రైల్వే మేనేజర్(డీఆర్ఎం)లకు అప్పగించింది రైల్వే శాఖ.
ఇటీవలే తక్కువ దూరం ప్యాసింజర్ రైలు ప్రయాణ ఛార్జీలు పెంచింది రైల్వే శాఖ.
తాత్కాలికమే..
స్టేషన్లలో రద్దీని నియంత్రించే బాధ్యత డీఆర్ఎంలదేనని రైల్వే శాఖ ప్రకటనలో తెలిపింది. ప్రజల భద్రత కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. అయితే పెంపు తాత్కాలికమేనని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
కొత్తేమీ కాదు..
కొవిడ్ కారణంగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న వేళ ధరలు పెంచడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే రద్దీని అదుపు చేయడానికి ధరల పెంపు విధానం ఎప్పటినుంచో ఆచరణలో ఉందని రైల్వే శాఖ తెలిపింది. అనవసర ప్రయాణాలను తగ్గించడానికే గానీ డబ్బులు సంపాదించడానికి ఈ నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేసింది.
ఇదీ చూడండి: 'ఇది కేరళ.. భాజపా రౌడీయిజం ఇక్కడ కుదరదు'