డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కుమార్తె సెంతామరై నివాసంపై ఆదాయ పన్ను శాఖ దాడులు జరిపిందనే వార్తలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కోలేని సమయంలోనే భాజపా ఇలాంటి దాడులు చేయిస్తుందని విమర్శించారు. ప్రతిపక్షాలపై ఐటీ శాఖతో సోదాలు నిర్వహించడం కమలదళం అనాదిగా పాటిస్తున్న విధానమని ధ్వజమెత్తారు.
రాజకీయ దురుద్దేశంతోనే స్టాలిన్ కూతురు ఇంట్లో ఐటీ తనిఖీలు నిర్వహించిందని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ విమర్శించారు. ఇలాంటి చర్యలతో తాము భయపడబోమని తేల్చి చెప్పారు. ఈ తరహా దాడులను తమ పార్టీ గతంలో ఎన్నో ఎదుర్కొందని పేర్కొన్నారు.
స్టాలిన్ కుమార్తె ఇంట్లో సోదాల విషయంపై ఐటీ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. దాడులు జరిగాయని గానీ, జరగలేదని గానీ సమాచారం ఇవ్వలేదు.