కేరళలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వయనాడ్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్‌గా ప్రకటించడంపై రాష్ట్ర సర్కార్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలన్నారు. ఈ నిర్ణయం స్థానిక ప్రజల ఉపాధికి సంబంధించిన విషయమన్న రాహుల్.. వారి జీవనోపాధికి ఆటంకం కలుగుతుందని మండిపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
"వయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యం పరిసర ప్రాంతాలను బఫర్ జోన్‌గా ప్రకటించడంపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ప్రకటించాలి. ఇది స్థానిక ప్రజల జీవనోపాధిని ప్రమాదంలో పడేస్తోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అక్కడి ప్రజల భవిష్యత్తుని అంధకారంలోకి తోస్తుంది. ఇప్పటికైనా మేలుకొని దిద్దుబాటు చర్యలను ప్రారంభించాలి."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
దిల్లీలో చెప్పండి..
రాహుల్ గాంధీ విమర్శలపై కేరళ అటవీశాఖ మంత్రి స్పందించారు. బఫర్‌జోన్‌గా ప్రకటించడం కేంద్రం తీసుకున్న నిర్ణయం అని అన్నారు. రాహుల్ గాంధీ దిల్లీలోనే ఉంటారన్న ఆయన.. అక్కడ ఉండే కేంద్ర అటవీ శాఖకు తగు సూచనలు చేయాలని ట్వీట్ చేశారు.
మద్దతు ధర అనుమానమే..
కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలపై రాహుల్ విరుచుకుపడ్డారు. వ్యవసాయ మార్కెట్లను నాశనం చేయడమే భాజపా ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధర లభించకపోవచ్చని అభిప్రాయపడ్డారు.