ఉద్దీపన చర్యల కింద కేంద్రం సోమవారం ప్రవేశపెట్టిన ప్యాకేజీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. అది ప్యాకేజీ కాదని.. కేంద్రం చేసిన మరో మోసం అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్యాకేజీని సామాన్యులు తమ రోజువారీ అవసరాలకు ఉపయోగించుకోలేరని పేర్కొన్నారు. ట్విట్టర్ ద్వారా రాహుల్ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు.
'డబ్బు పంపిణీ చేయండి'
ప్రస్తుత పరిస్థితుల్లో పేద, మధ్య తరగతి వారికి డబ్బు అందించడం ఒక్కటే మార్గమని.. ఈ తరహా ప్యాకేజీలతో ఉపయోగం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం పేర్కొన్నారు.
"రుణాలు ఇవ్వటం వల్ల ఉపయోగం లేదు. అది లబ్ధిదారులకు మరింత భారంగా మారుతుంది. బ్యాంకులు కూడా ఇందుకు సుముఖత చూపించవు. ఇప్పటికే రుణ భారంతో సతమతం అవుతున్న వారు మరో అప్పు కోరుకోరు. ఆ స్థానంలో పెట్టుబడి అవసరం. సరఫరా ఎక్కువ ఉంటే డిమాండ్ పెరగదు. అందుకు భిన్నంగా డిమాండ్‌పైనే సరఫరా ఆధారపడి ఉంటుంది."
-చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత
ఉద్యోగాలు పోయి, ఆదాయం తగ్గిన చోట డిమాండ్ పెరగదని చిదంబరం తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో నగదు పంపిణీ ఒక్కటే పరిష్కారం అని సూచించారు.
కరోనా రెండో దశ నేపథ్యంలో ఉద్దీపన చర్యల కింద కేంద్రం సోమవారం రూ.6.28 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది.
ఇదీ చదవండి : 'అప్పటి వరకు ఒకే దేశం- ఒకే రేషన్ అమలు కావాల్సిందే'