Rahul Foreign Trip: విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 14న ఓటింగ్ ప్రారంభం కానున్న గోవాలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్రంలో పార్టీ పొత్తులపై చర్చించేందుకు గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు గిరీష్ చోడంకర్, శాసనసభ పక్ష నేత దిగంబర్ కామత్‌లను దిల్లీకి పిలిచినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Elections 2022: గోవాలో ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయడానికి సీనియర్ నాయకులు కేసీ వేణుగోపాల్, పీ చిదంబరంతో సోమవారం సాయంత్రం భేటీ అయ్యారని సమాచారం. గోవాలో విజయమే లక్ష్యంగా గోవా ఫార్వర్డ్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ మరిన్ని ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేసేందుకు సన్నద్ధం అవుతోంది. ఎన్నికలు జరగనున్న పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్, మణిపుర్లోనూ పార్టీ నాయకులతో ఇలాంటి సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్రాల్లో అభ్యర్థులను ఖరారు చేయడానికి పార్టీ కేంద్రకమిటీ కూడా భేటీ కానుందని సమాచారం.
ఇదీ చదవండి: ప్రధాని భద్రతా వైఫల్యంపై సుప్రీంలో మరో వ్యాజ్యం