Rahul Gandhi Twitter: కేంద్రం ఒత్తిడి వల్లే తన ఫాలోవర్స్‌ను ట్విట్టర్ తగ్గిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ మేరకు ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌కు లేఖ రాశారు. "ట్విట్టర్ తనకు తెలియకుండానే పరోక్షంగా భావప్రకటన స్వేచ్ఛను హరిస్తోందని భావిస్తున్నాను. 2021 ఆగస్టు నుంచి నా ఖాతా ఫాలోవర్ల సంఖ్యను ట్విట్టర్ నియంత్రిస్తోంది" అని రాహుల్ పేర్కొన్నారు.
ఆగస్టులో తన ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత నుంచే ఫాలోవర్స్ తగ్గుతున్నారని రాహుల్ గాంధీ తెలిపారు. అంతకుముందు నెలకు 2.3 లక్షల మంది కొత్త ఫాలోవర్లు వచ్చే వారని.. పలు సందర్భాల్లో ఈ సంఖ్య 6.5 లక్షలకు చేరిందని చెప్పుకొచ్చారు.
నకిలీ ఖాతాలను మాత్రమే తొలగిస్తాం
రాహుల్ గాంధీ ఆరోపణలపై ట్విట్టర్ ప్రతినిధి స్పందించారు. రాహుల్ ఖాతా ఫాలోవర్ల సంఖ్య సరిగ్గానే ఉందని తెలిపారు. నకిలీ ఖాతాలపై మాత్రం ట్విట్టర్ కఠిన చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఫాలోవర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతి వారం కొన్ని లక్షల అకౌంట్లను తొలగిస్తామని తెలిపారు.
ప్రస్తుతం రాహుల్ ట్విట్టర్ ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య 19.6 మిలియన్లుగా ఉంది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి :నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం.. 35 వర్సిటీల ధ్రువపత్రాలు ఫోర్జరీ!