ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలు ఉన్నా... ఆరెస్సెస్, భాజపా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తాము ఏకతాటిపై నిలబడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 134 రోజుల సుదీర్ఘ భారత్ జోడో యాత్ర తర్వాత... శ్రీనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ ప్రసంగించారు. చర్చలు, సంభాషణలతో విపక్షాల మధ్య ఐక్యత ఏర్పడుతుందని తెలిపారు. భారత్ జోడో యాత్ర... దక్షిణ భారత్ నుంచి ఉత్తర భారత్ వరకు సాగినా దాని ప్రభావం దేశవ్యాప్తంగా ఉందన్నారు. దేశంలోని పార్లమెంటు, అసెంబ్లీలు, న్యాయవ్యవస్థ, మీడియాపైనా భాజపా దాడులు చేస్తోందని మండిపడ్డారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీ ప్రదర్శన మాత్రమే కాదని... సామాన్య ప్రజల ఉద్యమంగా మారిందని పేర్కొన్నారు. ఇంతటితో భారత్ జోడో యాత్ర ముగియలేదని, ఇది కొత్త ప్రారంభానికి తొలి అడుగు అని రాహుల్ స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్‌లో పరిస్థితి అంతా బాగుంటే.. భాజపా నేతలు లాల్‌చౌక్ వరకు ఎందుకు యాత్ర చేయరని రాహుల్ ప్రశ్నించారు. జమ్ము నుంచి కశ్మీర్‌కు అమిత్ షా ఎందుకు నడవరని నిలదీశారు.
గొప్ప అనుభవాన్ని ఇచ్చింది
భారత్ జోడో యాత్ర తనకెంతో గొప్ప అనుభవాన్ని ఇచ్చిందని రాహుల్ పేర్కొన్నారు. యాత్రలో భాగంగా దేశంలోని రైతులతో పాటు నిరుద్యోగ యువత సమస్యలను ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నానని రాహుల్ పేర్కొన్నారు.
చైనాతో కఠినంగా వ్యవహరించాలి
భారత్-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందిస్తూ.. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దురాక్రమణ అంశాన్ని రాహుల్ గాంధీ లేవనెత్తారు. చైనా అక్రమంగా భారత భూభాగాన్ని ఆక్రమించిందని ఆయన ఆరోపించారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకోలేదని కేంద్రం బహిరంగంగా అంగీకరించడం అత్యంత ప్రమాదకరమని అన్నారు. చైనాతో మరింత కఠినంగా వ్యవహరించాలని, లేదంటే డ్రాగన్ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశముందని అన్నారు.
ఆర్టికల్ 370 రద్దుకు కట్టుబడి ఉన్నాం
ఆర్టికల్ 370 రద్దుపై తమ పార్టీ వైఖరీ ఇప్పటికీ మారలేదని.. జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదాతో పాటు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలనే నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని రాహుల్ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: