Opposition protest outside parliament: కేంద్ర ప్రభుత్వం.. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు ప్రయత్నిస్తోందని, ప్రజల గొంతుకను అణచివేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశానికి సంబంధించిన కీలక విషయాలను పార్లమెంట్లో ప్రస్తావించేందుకు విపక్షానికి అవకాశమే ఇవ్వడం లేదన్నారు.
12మంది ఎంపీల సస్పెన్షన్‌పై పార్లమెంట్ ఆవరణంలోని గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు మంగళవారం నిరసన చేపట్టాయి. అనంతరం పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు ప్లకార్డులు పట్టుకుని ఎంపీలు ర్యాలీ నిర్వహించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
"దేశంలో ప్రజా గొంతుకను అణచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని చెప్పడానికి ఎంపీల సస్పెన్షన్ నిదర్శనం. ఎంపీల గొంతును నొక్కేస్తున్నారు. వారు ఎలాంటి తప్పు చేయలేదు. ముఖ్యమైన అంశాలను పార్లమెంట్లో చర్చించేందుకు మాకు అనుమతినివ్వడం లేదు. పార్లమెంట్లో చర్చలు లేకుండానే బిల్లుల మీద బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. పార్లమెంట్‌ను నడిపే విధానం ఇది కాదు. ప్రధాని సభకు రావడం లేదు. జాతీయస్థాయిలో ముఖ్యమైన విషయాలను ప్రస్తావించేందుకు మాకు అవకాశం లభించడం లేదు. ప్రజాస్వామ్యాన్ని హత్యచేస్తున్నారు."
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత.
రాజ్యసభ వాయిదా..
Parliament opposition protest: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి విపక్షాలు నిరసనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పెద్దల సభ కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. తాజాగా.. మంగళవారం కూడా విపక్ష ఎంపీలు ఆందోళనలు చేశారు. వెల్‌లోకి వెళ్లి తమ నిరసన తెలిపారు. వారి వైఖరిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తప్పుబట్టారు. పార్లమెంట్ విలువలకు తగ్గట్టు ప్రవర్తించాలని కోరారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడం వల్ల సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
'ఇప్పటికైనా సభకు రండి'
విపక్షాల నిరసనలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ఇప్పటికైనా జరిగిన పరిణామాలపై విచారం వ్యక్తం చేయాలని, సభకు రావాలని కాంగ్రెస్ సహా ఇతర పార్టీ నేతలకు సూచించారు. అన్ని విషయాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:- మోదీ ఖాతా హ్యాక్‌పై పార్లమెంట్ స్థాయీసంఘం ప్రశ్నలు