Rahul Gandhi On Modi : ప్రపంచ కప్పు ఫైనల్లో భారత్ జట్టు ఓడిపోవడానికి కారణం.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ మ్యాచ్‌కు హాజరుకావడమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. పీఎం అంటే అర్థం పనౌతీ మోదీ అని ఎద్దేవా చేశారు. ఎన్నికలో ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌లోని బాడ్మేర్ జిల్లాలో జరిగిన సభలో పాల్గొన్న రాహుల్.. ప్రధాని మోదీ చెడు శకునమని.. అందుకే మ్యాచ్ ఓడిపోయామని ఆక్షేపించారు. అదానీ ప్రజల సొమ్మును కాజేస్తుంటే ప్రధాని ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని ఆరోపించారు.
"ప్రధాని నరేంద్ర మోదీ పని... మీ(ప్రజలు) దృష్టిని అటు ఇటు మళ్లించడం. అదానీ పని మీ జేబులను కొల్లగొట్టడం. మోదీ క్రికెట్ మ్యాచ్‌కు వెళ్లారు. వాళ్లని ఓడించేశారు. పనౌతీ ( చెడు శకునం). పీఎం అంటే అర్థం పనౌతీ మోదీ."
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్
క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ ఓటమికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్ష కారణమంటూ రాజస్థాన్ ప్రచారంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. రాహుల్ వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రధాని గురించి అలాంటి వ్యాఖ్యలు చేసిన రాహుల్ క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ నేత రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు.
"రాహుల్ ఉపయోగించిన పదాలు అవమానకరంగా ఉన్నాయి. గౌరవమైన ప్రధానమంత్రి పదవి గురించి ఇలాంటి పదాలా..? మన దేశానికి చెందిన నేతను ప్రపంచమంతా గౌరవిస్తోంది. రాహుల్‌గాంధీకి ఏమైంది...? ఆయన నేర్చుకోరు. ఆయన తల్లి గుజరాత్‌లో మౌత్ కా సౌదాఘర్ అని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గాలిపోయింది. రాహుల్ క్షమాపణ చెప్తారని ఆశిస్తున్నాం. కానీ ఆయన చెప్పరు కదా...? సుప్రీంకోర్టులో కూడా నిరాకరించారు. దేశప్రజలు ఆయనకు గట్టిగా సమాధానం ఇస్తారు."
-- రవిశంకర్ ప్రసాద్, బీజేపీ సీనియర్ నేత
200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్‌లో నవంబరు 25న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడం వల్ల ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
5ఏళ్లలో 10లక్షల ఉద్యోగాలు, రాష్ట్రంలో పక్కాగా కులగణన- రాజస్థాన్ ప్రజలపై కాంగ్రెస్ హామీల వర్షం
యువకుడిని హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టిన వ్యక్తి- తల, మొండెం వేరు చేసి