Rahul Gandhi on farmers protest: రైతు నిరసనల్లో మరణించిన వారికి పరిహారం చెల్లిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని.. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఓ వైపు ఆందోళనల్లో 700మంది మరణించారని, కానీ తమ వద్ద డేటా లేదని ప్రభుత్వం చెబుతోందని మండిపడ్డారు.
మంగళవారం లోక్‌సభ జీరో అవర్‌లో రైతు మరణాల అంశాన్ని ప్రస్తావించారు రాహుల్. ఈ క్రమంలోనే కేంద్రంపై ఆరోపణలు చేశారు.
"నిరసనల్లో 700మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. దేశానికి, దేశంలోని రైతులకు ప్రధాని స్వయంగా క్షమాపణలు చెప్పారు. తప్పుచేశానని ఆయనే అంగీకరించారు. ఇప్పుడేమో.. రైతుల మరణంపై తమ వద్ద డేటా లేదని ప్రభుత్వం చెబుతోంది. ఏంటిది? 400మంది రైతులకు పంజాబ్ ప్రభుత్వం రూ. 5లక్షలు చొప్పున పరిహారం ఇచ్చింది. 152మందికి ఉద్యోగాలు ఇచ్చింది. నా దగ్గర జాబితా ఉంది. ప్రభుత్వం మాత్రం డేటా లేదు అంటోంది. రైతుల హక్కులు.. రైతులకు ఇవ్వాలి. వారికి ఉద్యోగాలివ్వాలి. ఇదే మా డిమాండ్"
--- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత.
ఈ విషయంపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ.. లోక్‌సభ నుంచి కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే నేతలు వాకౌట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
farmers death compensation: వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఏడాదికాలంగా చేపట్టిన ఆందోళనల్లో సంభవించిన రైతుల మరణాలపై తమ వద్ద సమాచారం లేదని.. గత నెల 30న పార్లమెంట్ వేదికగా కేంద్రం ప్రకటన చేసింది.
రైతు మరణాలు, నిరసనల వల్ల ప్రభావితమైన రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం, కేసుల ఉపసంహరణపై విపక్షాలు ప్రశ్నించాయి. దీనిపై.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంట్‌కు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఆ అంశాలపై ప్రభుత్వం వద్ద తగిన సమాచారం లేదన్నారు. అలాంటప్పుడు సాయం అనే దానికి తావే లేదని తోమర్ స్పష్టం చేశారు. అసలు ఇలాంటి ప్రశ్నకే ఆస్కారం లేదని చెప్పారు.
ఇదీ చూడండి:- 'రైతుల డిమాండ్లకు కేంద్రం ఓకే.. ఆ రోజున ఆందోళన ముగింపు'