Rahul Gandhi Hindutva: కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ.. తాను హిందువునని, హిందుత్వవాదిని కాదని అనడంపై భాజపా అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ హిందువు కాదని, హిందుస్థానీ అసలే కాదని ఆరోపించారు. ఈ మేరకు గాంధీ కుటుంబాన్ని బోకో హరామ్, ఐఎస్ఐఎస్ తీవ్రవాద టెర్రరిస్ట్ సంస్థలతో పోల్చారు.
గాంధీ కుటుంబం పదవికోసం పాకులాడుతోందన్న విషయం.. దేశంలోని చిన్నపిల్లాడికి సైతం తెలుసునన్నారు. రాహుల్.. తన ప్రసంగాలతో ప్రజల్లో విషం నింపుతున్నారని మండిపడ్డారు. మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందడం ఆయనకు ఇష్టం లేదని ఆరోపించారు.
అంతేకాక రాహుల్ గాడ్సే, బాబూరామ్ చౌరాసియా సోదరుడని ఆరోపించారు. ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీ.. గాంధీజీ సిద్ధాంతాలను పాటిస్తుందన్నారు.
అంతకుముందు జైపుర్‌లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడిన రాహుల్.. భారత దేశం హిందువులది తప్ప హిందుత్వవాదులది కాదని అన్నారు. దేశ రాజకీయాల్లో హిందువులకు.. హిందుత్వవాదికి మధ్య తీవ్ర పోటీ ఉందన్న రాహుల్.. మహాత్మా గాంధీ హిందువని, గాడ్సే హిందుత్వవాదని తెలిపారు. తాను హిందువునని తెలిపిన రాహుల్.. హిందుత్వవాదిని కాదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'హిందుత్వవాదులను గద్దె దింపి.. హిందువులకు అధికారం కట్టబెట్టాలి'