Rahul Gandhi Modi Surname Case: 'మోదీ ఇంటి పేరు'పై వ్యాఖ్యలకు నమోదైన పరువు నష్టం కేసులో తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ప్రతివాదులైన గుజరాత్ సర్కారు, ఆ రాష్ట్ర ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీకి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. అనంతరం ఆగస్టు 4కు విచారణను వాయిదా వేసింది. ఈ కేసులో సూరత్‌లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను నిలిపివేయాలన్న రాహుల్ అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. దీంతో ఆ తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ సుప్రీంను ఆశ్రయించారు.
Rahul Gandhi Defamation Case : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తరఫున.. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టు ముందు వాదనలు వినిపించారు. సూరత్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాని పరిస్థితి ఎదురయ్యిందని సింఘ్వి కోర్టుకు తెలిపారు. వీలైనంత త్వరగా రాహుల్ పిటిషన్‌ను విచారించాలని ధర్మాసనానికి సింఘ్వి విజ్ఞప్తి చేశారు.
Rahul Gandhi Disqualification : 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఈ పరువునష్టం కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన సూరత్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ ఏడాది మార్చిలో తీర్పు వెలువరించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం, పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి.. కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది. దీంతో సూరత్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువడిన 24 గంటల్లోనే రాహుల్‌పై అనర్హత వేటు వేస్తూ.. లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయింది.
Rahul Gandhi Supreme Court Latest News : సూరత్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో రాహుల్ గాంధీకి కిందికోర్టు శిక్ష విధించడం సరైనదేనని హైకోర్టు తెలిపింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఆయన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.