కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. అనర్హత వేటుపై న్యాయపరంగా, రాజకీయంగానూ పోరాడతామని ప్రకటించింది. దీనిపై తాము భయపడేదిగానీ, మౌనంగా ఉండేది లేదని స్పష్టం చేసింది. ఇది ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమేనని వ్యాఖ్యానించారు పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ. అధికారపక్షం ప్రజాస్వామ్య సంస్థలను ఓ క్రమపద్ధతిలో నిర్వీర్యం చేస్తోందన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంటు లోపల, బయట నిర్భయంగా మాట్లాడుతున్నారని.. అందుకే ఆయనపై కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడారు.
"రాహుల్ గాంధీ దేశ సమస్యలపై పోరాడుతున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం రాహుల్‌పై ఈ చర్యలకు పాల్పడుతోంది. నోట్ల రద్దు, లోపభూయిష్ట జీఎస్‌టీ రూపకల్పన, చైనా సరిహద్దు వివాదం వంటి అంశాలపై రాహుల్ గాంధీ వాస్తవాలను మాట్లాడుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది." అని సింఘ్వీ అన్నారు. దేశంలోని వాస్తవ సమస్యల నుంచి దృష్టిని మరల్చడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఇదంతా చేస్తుందని సింఘ్వీ ఆరోపించారు. మిగతా కేసుల మాదిరిగా కాకుండా ఇంతా త్వరగా రాహుల్ గాంధీపై చర్యలు ఎందుకు తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
వయనాడ్ స్థానం ఖాళీ.. లోక్‌సభ సచివాలయం నొటిఫికేషన్ జారీ
కాగా రాహుల్ ప్రాతినిథ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజక వర్గం ప్రస్తుతం ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ విడులైంది. ఈ మేరకు లోక్ సభ సచివాలయం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. శుక్రవారం నుంచే ఈ స్థానం ఖాళీ అయిందని అందులో పేర్కొంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటిఫికేషన్లో తెలిపింది.
స్పందించిన రాహుల్ గాంధీ..
అనర్హత వేటు పడ్డాక కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. తాను దేశ గొంతుక కోసం పోరాడుతున్నాని.. అందుకు కోసం ఎంత మూల్యం చెల్లించుకోవడానికైనా సిద్ధమేనని ట్వీట్ చేశారు.
ఓం శాంతి అని ట్వీట్ చేసిన జైరాం రమేశ్..
అదానీ మహామెగాస్కామ్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ నియమించడానికి బదులు రాహుల్‌గాంధీపై అనర్హత వేటువేశారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. భారత ప్రజాస్వామ్యం ఓం శాంతి అని జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.
ఆశ్చర్యం వ్యక్తం చేసిన శశిథరూర్..
రాహుల్‌గాంధీపై ఇంత వేగంగా అనర్హత వేటు వేయడంపై సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు వెలువడిన 24 గంటల్లోపు చర్య తీసుకోవడం.. పైకోర్టుకు అప్పీలు చేసుకోకముందే అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని ట్వీట్ చేశారు.
భేటీ అయిన కాంగ్రెస్ ముఖ్యనేతలు..
రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన తర్వాత పార్టీ వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ ముఖ్యనేతలంతా దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో ఈ కీలక సమావేశం జరిగింది. సమావేశానికి ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా కాంగ్రెస్ కీలక నేతలంతా హాజరయ్యారు. శుక్రవారం సాయత్రం ఆరు గంటల సమయంలో ఈ సమావేశం జరిగింది. కాకపోతే ఈ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరు కాలేదు.
దేశమంతా జన ఆందోళన్..
రాహుల్ అనర్హతపై మండిపడ్డ కాంగ్రెస్.. దేశమంతా ఆందోళనకు పిలుపునిచ్చింది. 'జన్ ఆందోళన్' పేరుతో ఈ కార్యక్రమం చేయనున్నట్లు సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. సోమవారం దేశ వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని ఆయన వెల్లడించారు. అదే విధంగా మిగతా పార్టీలతో కలిసి రాష్ట్రపతిని కలవనున్నట్లు జైరాం తెలిపారు. రాహుల్ విషయంలో ప్రతిపక్షాల మద్ధతును ఆయన స్వాగతించారు. భారత్ జోడో యాత్ర ఉద్యమంగా మారిందని, దీంతో బీజేపీ ఉలిక్కిపడిందన్న జైరాం రమేశ్.. అదానీ అంశంపై కాంగ్రెస్ ప్రశ్నిస్తోందనే ఈ చర్యలకు పాల్పడుతుందన్నారు.
అనర్హత వేటును తప్పుబట్టిన ప్రతిపక్షనేతలు..
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం ప్రగతిశీల, ప్రజాస్వామ్య శక్తులపై దాడి చేయడమేనని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎమ్‌కే పార్టీ అధ్యక్షులు స్టాలిన్ అభిప్రాయపడ్డారు. "ఇది బెదిరింపు చర్య. ఓ ఎంపీ, జాతీయ రాజకీయ పార్టీ నాయకులు అనర్హత వేటు వేసి.. ప్రజాస్వామ్య హక్కు లేదనే సందేశాన్ని తన అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం పంపుతున్నట్లు కనిపిస్తోంది. ఇది ప్రజాస్వామ్య హక్కును హరించడమే అవుతుంది." అని స్టాలిన్ అన్నారు. "ఇది ఖండించదగిన చర్య. రాజ్యాంగ ప్రాథమిక సిద్ధాంతాలకు ఇది పూర్తిగా విరుద్ధం. ఈ చర్య ప్రజాస్వామ్య విలువల పతనాన్ని ఎత్తిచూపింది." అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ అభిప్రాయపడ్డారు.
"మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతుంది. రాహుల్‌పై అనర్హత వేటు భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజు. మోదీ దురహంకారం నియంతృత్వానికి పరాకాష్ట. పార్లమెంటును కూడా తమ హేయమైన చర్యలకు వాడడం గర్హనీయం. ఇటువంటి చర్యల వల్ల ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించింది."
--కే. చంద్రశేఖర్ రావు, తెలంగాణ ముఖ్యమంత్రి, భారాస అధ్యక్షుడు
ఖండించిన భాజపా నేతలు..
రాహుల్ గాంధీపై కాంగ్రెస్‌లోనే కుట్ర జరుగుతోందని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడింది. రాహుల్ అనర్హత వేటుపడినా హైకోర్టుకు ఆశ్రయించకపోవడానికి ఇదే కారణమని ఆరోపించింది. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కోర్టు ఇచ్చిన తీర్పును విమర్శించడమేంటని ప్రశ్నించారు. నెహ్రూ-గాంధీ కుటుంబం "ఫ్యూడల్ మైండ్‌సెట్‌తో బాధపడుతోదన్నారు. చట్టం అందరికీ సమానమేనన్న ధర్మేంద్ర ప్రధాన్.. మోదీ ఇంటి పేరే లక్ష్యంగా వెనుకబడిన కులాలను.. రాహుల్ దొంగలని హేళన చేశారన్నారు.