Rahul Gandhi Defamation case Supreme Court : మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పబోనని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేశారు. ఈ కేసులో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆయన.. ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని దుర్వినియోగం చేసి.. తప్పు చేయకపోయినా తాను క్షమాపణ చెప్పాలని కోరడం న్యాయ ప్రక్రియను అపహస్యం చేయడమేనని తన అఫిడవిట్లో పేర్కొన్నారు. తాను క్షమాపణ చెప్పేందుకు ఇష్టపడలేదు కాబట్టే 'అహంకారి' అంటూ దుర్భాషలాడుతున్నారని తనపై కేసు పెట్టిన గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
"తాను నిర్దోషినని పిటిషనర్ (రాహుల్ గాంధీ) ముందు నుంచీ చెబుతూ వస్తున్నారు. తనపై విధించిన శిక్ష నిలబడదని విశ్వసిస్తున్నారు. ఆయన క్షమాపణ చెప్పాలని అనుకుంటే ఎప్పుడో చెప్పేవారు. ఈ కేసు అసాధారణమైనది. నేరం కూడా చిన్నదే. అదేసమయంలో ఫిర్యాదుదారుడి (పూర్ణేశ్ మోదీ)కి ఎలాంటి నష్టం జరగలేదు. కాబట్టి రాహుల్ గాంధీకి విధించిన శిక్షను నిలిపివేయండి. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ సమావేశాలు, ఆ తర్వాత జరిగే సమావేశాలకు హాజరయ్యేలా అనుమతించండి."
-సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ తరఫున పిటిషన్
మోదీ అనే పేరుతో ఎలాంటి వర్గం లేదని పిటిషన్లో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 'అధికారికంగా మోదీ సమాజం, మోదీ వర్గం అనేవి లేవు. మోదీ వానిక సమాజ్, మోధ్ గంచి సమాజ్ అనే వర్గాలే ఉన్నాయి. ఇంటిపేరు మోదీ అనేది అనేక కులాలవారికి ఉంటుందని ఫిర్యాదుదారు సైతం అంగీకరించారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, మెహుల్ ఛోక్సీలు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కాదన్న విషయాన్నీ ఫిర్యాదుదారు అంగీకరించారు. కాబట్టి మోదీ సమాజం మొత్తాన్ని రాహుల్ గాంధీ కించపరిచారన్న వాదనే తెరపైకి రాదు' అని సుప్రీంకోర్టులో రాహుల్ తరఫున దాఖలైన పిటిషన్ పేర్కొంది.
కాగా, ఈ వివాదంలో రాహుల్ గాంధీకి గుజరాత్లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. తనకు విధించిన శిక్షను రద్దు చేయాలని రాహుల్ గాంధీ.. గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఆయనకు చుక్కెదురైంది. రాజకీయాల్లో స్వచ్ఛత అవసరమని పేర్కొంటూ రాహుల్ పిటిషన్లను గుజరాత్ హైకోర్టు కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు రాహుల్. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం.. పూర్ణేశ్ మోదీ సహా గుజరాత్ ప్రభుత్వానికి జూన్ 21న నోటీసులు పంపించింది. రాహుల్ పిటిషన్పై స్పందించాలని ఆదేశించింది.