Wife Leaves Husband For Tomato : కూరలో టమాటాలు వేసి వంటచేశాడని భర్తను విడిచిపెట్టి వెళ్లిపోయింది ఓ భార్య. ఈ ఆశ్చర్యకర ఘటన మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో జరిగింది.
ధన్‌పురికి చెందిన సందీప్ బర్మన్ అనే వ్యక్తి అదే ప్రాంతంలో చిన్న ధాబా నడుపుతున్నాడు. నాలుగు రోజుల క్రితం తన ధాబాలో బర్మన్.. టమాటాలు వేసి కూరను వండాడు. దీంతో బర్మన్కు, అతడి భార్యకు మధ్య గొడవ జరిగింది. కిలో టమాటా రూ.140 ఉన్న సమయంలో కూరలో టమాటా ఎందుకు వేశావని బర్మన్తో గొడవపెట్టుకుంది అతడి భార్య. తర్వాత మనస్తాపానికి గురై తన కుమార్తెతో కలిసి భర్తను వదిలి వెళ్లిపోయింది. ఇక చేసేదేంలేక పోలీసులను ఆశ్రయించాడు బర్మన్.
'నేను రెండు మూడు టమోటాలు వేసి కూర వండాను. కిలో టమాటా రూ.140 పలుకుతున్న సమయంలో కూరలో ఎందుకు టమాటా వేశావు అని నా భార్య గొడవపడింది. నా మీద కోపంతో నా కుమార్తెను తీసుకుని మూడు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమెను ఎలాగైనా నా వద్దకు రప్పించండి' అని ధాబా నిర్వాహకుడు సందీప్ బర్మన్ పోలీసుల వద్ద వేడుకున్నాడు. దీంతో పోలీసులకు అతడిని సముదాయించారు.
'సందీప్ బర్మన్ అనే వ్యక్తి తన భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఫిర్యాదు చేశాడు. అతడి భార్య.. ఉమారియా జిల్లాలోని తన సోదరి ఇంటికి వెళ్లింది. ఆమెతో ఫోన్లో మాట్లాడాం. ఆమె సందీప్ బర్మన్ ఇంటికి వచ్చేందుకు అంగీకరించింది. టమాటాల విషయంలో జరిగిన గొడవ వల్లే ఆమె తన సోదరి ఇంటికి వెళ్లిపోయింది.'
--పోలీసులు
గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో మధ్యతరగతి ప్రజలు టమాటాలను కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.100 నుంచి రూ.150 వరకు కిలో టమాటా ధర పలుకుతోంది.
టమాటా దొంగలు..
Tomatoes Theft In UP : మూడు దుకాణాల నుంచి టమాటాలు, అల్లం, వెల్లుల్లిని దొంగిలించారు ఇద్దరు వ్యక్తులు. అనంతరం మార్కెట్లో చౌకగా వాటిని అమ్మడం ప్రారంభించారు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన తోటి వ్యాపారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పుడు నిందితులిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని పతేఫుర్లో బుధవారం జరిగింది. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టి దొంగలను గుర్తించారు. నయీమ్, రామ్‌జీని నిందితులుగా గుర్తించారు. వారు కూడా కూరగాయల వ్యాపారులేనని తెలిపారు.