దిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ అధికారులపై పంజాబ్‌కు చెందిన ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. వీసా కోసం వెళ్తే అక్కడి సిబ్బంది తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. అంతేగాక, భారత్‌కు వ్యతిరేకంగా పనిచేయాలని తనకు డబ్బు ఆశ చూపారని పేర్కొన్నారు. దీనిపై పాక్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు.
పంజాబ్‌లోని ఓ యూనివర్శిటీలో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ 2021లో పాకిస్థాన్‌లోని ఓ కాలేజీలో లెక్చర్ ఇవ్వడానికి వెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నించారు. ఇందుకోసం దిల్లీలోని పాక్ హైకమిషన్‌లో వీసా ఇంటర్వ్యూ కోసం ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేశారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ కోసం అక్కడకు వెళ్తే సిబ్బంది తనను అసభ్యకర ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారని ఆ మహిళ ఆరోపించారు. ఇంటర్వ్యూలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలని, అందుకు తగినంత డబ్బులు ఇస్తామంటూ ఆశజూపారని ఆ మహిళ పేర్కొన్నారు. ఇందుకు తాను అంగీకరించకపోవడంతో వీసా మంజూరు చేసేందుకు నిరాకరించారని తెలిపారు.
దీంతో తాను ఎంబసీ నుంచి బయటకు వెళ్లిపోతుండగా ఓ అధికారి తన వద్దకు వచ్చి సాయం పేరుతో అసభ్యంగా ప్రవర్తించారని వాపోయారు. "మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నారు?" అంటూ ద్వంద్వార్థాలతో ప్రశ్నించారని ఆమె వాపోయారు. వీసా కావాలంటే లైంగిక కోరికలు తీర్చాలంటూ తనపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. దీనిపై పాకిస్థాన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశానని, పాక్ విదేశాంగ మంత్రికి లేఖ కూడా రాశానని ఆమె తెలిపారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో తాజాగా ఆమె భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు లేఖ రాశారు. తనకు న్యాయం చేయాలని ఆమె కేంద్రమంత్రిని కోరారు. అయితే ఆ మహిళ ఆరోపణలపై పాక్ హైకమిషన్ ఇంకా స్పందించలేదు.