పంజాబ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించారు. హోషియార్‌పుర్ జిల్లా గర్శంకర్ ప్రాంతంలో కాలినడకన వెళ్తున్న యాత్రికులను ఓ గుర్తుతెలియని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన.
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు..
బైశాఖీ పర్వదిన వేడుకల్లో పాల్గొనేందుకు సుమారు 50 మంది భక్తులు చరణ్ ఛో గంగా వైపు నడుచుకుంటూ వెళ్తున్నారని.. ఈ క్రమంలో వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ గుర్తుతెలియని ట్రక్కు వారిని ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగందని గర్శంకర్ డీఎస్పీ దల్జిత్ సింగ్ ఖాఖ్ వెల్లడించారు. ఈ ఘటనలో ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని ఆయన అన్నారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారని.. వీరంతా ఉత్తర్‌ప్రదేశ్ ముజఫర్‌నగర్ జిల్లాలోని మస్తాన్ ఖేరా ప్రాంతానికి చెందినవారిగా గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. ఘటన జరిగిన స్థలం పర్వత ప్రాంతం కావడం వల్ల లారీ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని.. దీంతో పాటు బ్రేకులు కూడా ఫెయిలై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారవ్వడం వల్ల అతడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.
మరోవైపు ఇదే రోజు గర్శంకర్ ప్రాంతంలోనే గర్హి మనోస్వాల్ సమీపంలో ట్రాక్టర్లో వెళ్తున్న మరో భక్తుల బృందం కూడా ప్రమాదానికి గురయింది. రోడ్డుపై వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది వాహనం. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు విడవగా.. మరో 10 మంది గాయపడ్డారు. వీరు కూడా బైశాఖీ పండుగా సందర్భంగా గర్శంకర్ సబ్ డివిజన్‌లోని శ్రీ ఖురల్‌గర్ సాహిబ్‌లో లంగర్ ఏర్పాటు చేసేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ఇక్కడి ప్రాంత రోడ్లు ఘోరంగా దెబ్బతినడం వల్లే ఇలాంటి ఘటనలో తరచూ జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ రహదారిలో ప్రమాదకరమైన మలుపుల కారణంగా కూడా డ్రైవర్లు నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి గురవతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వీటికి నిరసనగా గురువారం గ్రామస్థులు నిరసనకు దిగుతామని స్థానిక పరిపాలన విభాగాన్ని హెచ్చరించారు.
ప్రస్తుతం పంజాబ్‌లో బైశాఖీ పండుగ వేడుకలు జరుగుతున్నాయి. ఈ పర్వదినాన్ని సిక్కులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ క్రమంలో పంజాబ్‌లోని ప్రధాన గురుద్వారాల్లో భజన కార్యక్రమాలు నిర్వహించి లంగర్లు ఏర్పాటు చేస్తారు.