పంజాబ్ అమృత్‌సర్‌లో హింస చెలరేగింది. ఖలిస్థానీ అనుకూల సంస్థ 'వారీస్ పంజాబ్ దే' మద్దతుదారులు అజ్నాలా పోలీస్ స్టేషన్ వద్ద విధ్వంసానికి దిగి.. తమ అనుచరుడిని విడుదల చేయించుకున్నారు. 'వారీస్ పంజాబ్ దే' అధినేత అమృత్‌పాల్ పిలుపుతో.. వేలాది మంది మద్దతుదార్లు తుపాకులు, తల్వార్లతో అజ్నాలా పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. అమృత్‌పాల్ సింగ్ సన్నిహితుడు లవ్‌ప్రీత్ తుఫాన్ అరెస్టుకు నిరసనగా వారంతా ఇలా ఆందోళన చేశారు. చివరకు వీరి ఆందోళనలకు పోలీసులు తలొగ్గి లవ్‌ప్రీత్ తుఫాన్‌ను విడుదల చేశారు. అయితే, 'పంజాబ్ పోలీసులకు సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే లవ్ప్రీత్ను విడుదల చేశాం' అని అమృత్సర్ ఎస్ఎస్పీ వెల్లడించారు. ఈ వ్యవహారంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
అంతకుముందు అజ్నాలా పోలీస్ స్టేషన్ వద్ధ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. లవ్‌ప్రీత్ కోసం అజ్నాలా పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టాలని ఇటీవల బహిరంగంగా పిలుపునిచ్చారు అమృత్‌పాల్. ఈ నేపథ్యంలోనే ఆయుధాలు చేతబట్టి పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు వచ్చారు ఆయన మద్దతుదారులు. తల్వార్లతో పోలీసులపై దాడి చేస్తూ స్టేషన్లోకి చొచ్చుకెళ్లారు. నిరసనకారుల్ని కట్టడి చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆందోళకారుల దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో సాయంత్రం లవ్ప్రీత్ను విడుదల చేశారు పోలీసులు.
వివాదం ఏంటంటే?
లవ్‌ప్రీత్ తుఫాన్‌ను పోలీసులు అరెస్టు చేసి చిత్ర హింసలు పెడుతున్నారని అమృత్‌పాల్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమృత్ పాల్ సింగ్ తన అనుచరులతో కలిసి జల్పుర్ ఖైరా ప్రాంతం నుంచి అజనాలేకు భారీ ర్యాలీగా బయల్దేరారు. అక్రమంగా అరెస్టు చేసిన లవ్ప్రీత్ను విడుదల చేయకపోతే తమ సొంత ప్లాన్‌ను అమలు చేస్తామని పోలీసులను హెచ్చరించారు.
'150 మందితో నేను అక్కడికి వెళ్తున్నా. తుఫాన్ సింగ్‌ను చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసి ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నారు. తుఫాన్‌ను హింసిస్తున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన తుఫాన్ సింగ్‌ను విడుదల చేయకపోతే మా సంస్థ తన ప్లాన్ అమలు చేస్తుంది. మాపై అక్రమ కేసులు పెట్టడం ఆపకపోతే దీనికి మా సంస్థే పరిష్కారం కనుగొంటుంది.'
-అమృత్‌పాల్
వివాదాల అమృత్!
'వారీస్ పంజాబ్ దే'ను ఖలిస్థాన్ అనుకూల సంస్థగా పేర్కొంటారు. మత బోధకుడిగా చెప్పుకునే ఆ సంస్థ అధినేత అమృత్‌పాల్ సింగ్ చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. కిడ్నాప్, దొంగతనం, హింసకు పాల్పడటం వంటి కేసులు ఆయనపై నమోదయ్యాయి.