అవినీతి ఆరోపణలు కారణంగా పంజాబ్ మంత్రి ఫౌజా సింగ్ సరారీ రాజీనామా చేశారు. భగవంత్ మాన్ మంత్రివర్గంలో ఫౌజాసింగ్ ఉద్యానవన శాఖ మంత్రిగా ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో ఫౌజా సింగ్ రాజీనామా చేసినట్లు ఆప్ అధికార ప్రతినిధి మల్విందర్ సింగ్ తెలిపారు.
కొన్ని రోజుల క్రితం అవినీతి ఒప్పందానికి సంబంధించి ఒక ఆడియో వైరల్‌గా మారడం వల్ల ఫౌజాసింగ్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆడియోపై మండిపడిన ప్రతిపక్షాలు.. ఫౌజాసింగ్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఫౌజాసింగ్ కొట్టిపారేశారు. ప్రతిపక్షాల ఆరోపణల వల్ల శనివారం.. ఫౌజా సింగ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
తాను ఆమ్ ఆద్మీ పార్టీ సైనికుడినని.. ఎల్లప్పుడూ పార్టీ కోసం పనిచేస్తానని రాజీనామా అనంతరం ఫౌజా సింగ్ తెలిపారు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గురు హర్సహయ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. పదవీ విరమణ చేసిన అనంతరం ఆప్‌లో చేరారు.
ప్రమాణ స్వీకారం చేసిన బల్బీర్ సింగ్..
ఫౌజా సింగ్ రాజీనామా అనంతరం ఉద్యానవన శాఖ మంత్రిగా డాక్టర్ బల్బీర్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సమక్షంలో ఆ రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్.. బల్బీర్ సింగ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన పాటియాలా రూరల్ నియోజరవర్గం నుంచి ఆప్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. బల్బీర్ సింగ్ నవన్‌షహర్‌లో ఓ నిరుపేద రైతు కుటుంబంలో జన్మించారు. సరిగ్గా సదుపాయాలు లేని పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి ప్రముఖ కంటి వైద్యుడిగా పేరుపొందారు. గత 40 ఏళ్లుగా తన దగ్గరకి వచ్చిన 40 శాతం రోగులకు ఉచితంగా చికిత్స చేస్తున్నారు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో దల్బీర్ సింగ్.. 50,000 ఓట్ల తేడాతో గెలిచారు.