1906లో పంజాబ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వివాదాస్పద కాలనైజేషన్ చట్టాన్ని(Colonisation Act) అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం... ఎవరైనా రైతు చనిపోతే, వారికి వారసులు లేకుంటే ఆ భూమి ప్రభుత్వ పరం అవుతుంది. దాన్ని ఎవరికైనా ప్రభుత్వం అమ్మేయవచ్చు. అంతేగాకుండా 1890 నుంచి జరిగిన భూకేటాయింపుల్లో కూడా తేడాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. కౌన్సిల్‌లోని పంజాబ్ సభ్యులు, రాష్ట్ర చీఫ్‌సెక్రటరీ అభ్యంతరాలు వ్యక్తంజేసినా కొంతమంది తెల్లదొరల ఒత్తిడితో బిల్లును చకచకా లాగించేశారు. అప్పటికే ప్లేగుతో, అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితులతో, పెంచిన నీటితీరువాలతో సతమతమవుతున్న పంజాబ్ రైతులు(Punjab Farmers) ఈ చట్టంతో ఒక్కసారిగా కుదేలయ్యారు. భూమినే నమ్ముకొని సాగుతున్న జీవితాలు అల్లకల్లోలమవుతాయని మొరబెట్టుకున్నారు(Punjab Farmers). ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞాపనలిచ్చినా ఫలితం లేకపోయింది.
దావానలంలా..
అజిత్‌సింగ్ (భగత్‌సింగ్ సమీప బంధువు) సారథ్యంలో ఉద్యమం మొదలై... దావానలంలా వ్యాపించింది. సాంగ్లా, గోజ్రా, అమృత్‌సర్, రావల్పిండిల్లో ఆందోళనలు భారీస్థాయిలో జరిగాయి. అమృత్‌సర్, లాహోర్, రావల్పిండిల్లో ఆందోళన హింసాత్మకంగా మారింది. అజిత్‌సింగ్‌కు అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత లాలాలజపతిరాయ్ మద్దతు ప్రకటించారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వానికి సాకు దొరికినట్లైంది. రాజకీయ దురుద్దేశాలతో ఉద్యమం చేస్తున్నారని ఆరోపిస్తూ, దేశద్రోహం కేసు పెట్టి వారిద్దరినీ పంజాబ్ నుంచి బహిష్కరించింది. దీంతో ఉద్యమం మరింత ఉద్ధృతమైంది. అంతకు కొద్దికాలం ముందే బెంగాల్‌ను విభజించి ఉద్యమాలతో... ఆందోళనలతో ఇబ్బంది పడుతున్న బ్రిటిష్ ప్రభుత్వానికి ఇది మరో తలనొప్పిగా తయారైంది.
ప్రజలంతా ఏకమై..
బ్రిటిష్ వారు పాటిస్తున్న విభజించు పాలించు సూత్రాన్ని కూడా తోసి రాజని అన్ని కులాలు, మతాల ప్రజలు ఏకమై ఉద్యమంలో పాల్గొనటం ఆరంభించారు. 1857నాటి సిపాయిల తిరుగుబాటులాంటి పరిస్థితులు తలెత్తేలా ఉన్నాయన్న నిఘా నివేదికలకు తోడు... సిపాయిల భర్తీలో పంజాబ్ కీలకమనే సంగతిని కూడా గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కానీ రైతుల ఆందోళనకు తలవంచితే ప్రభుత్వం లొంగిపోయినట్లవుతుందని అధికారులు భీష్మించుకు కూర్చున్నారు. ఎలాగైనా ఆందోళనను అణచివేయటానికి సిద్ధమయ్యారు. కానీ 1907 మేలో వైస్రాయ్ లార్డ్ మింటో స్వయంగా రంగంలోకి దిగి... పంజాబ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చట్టాన్ని వీటో చేస్తూ ఆపేస్తున్నట్లు ప్రకటించారు. దాన్ని తప్పుడు చట్టంగా ఆయన అంగీకరించారు.
"దురదృష్టకరమైన ఈ చట్టాన్ని రైతులపై రుద్దటం వల్ల జరిగే నష్టం కంటే... వారి ఆందోళనకు ప్రభుత్వం 'లొంగటం' తక్కువ ప్రమాదకరం"
-లార్డ్ మింటో
ఇవీ చదవండి: