Punjab Ex Army Couple Murder: పంజాబ్‌లో శనివారం రాత్రి జరిగిన ఆర్మీ మాజీ అధికారి దంపతుల హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. కోడలే.. తన ప్రియుడితో కలిసి అత్తమామలను దహనం చేసినట్లు దర్యాప్తులో తేలింది.
ఏం జరిగిందంటే..?
పంజాబ్ హోషియార్పుర్లోని తాండాకు చెందిన రిటైర్డ్ ఆర్మీ అధికారి మంజీత్ సింగ్, ఆయన భార్య.. వారి ఇంట్లోనే దహనం అయ్యారు. ఈ ఘటన జరిగినప్పుడు మంజీత్ సింగ్ కోడలు మణిదీప్ కౌర్ ఇంట్లోనే ఉంది. మంజీత్ సింగ్ కుమారుడు రవీందర్ సింగ్.. మణిదీప్‌పై అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు ఆమెను తమదైన శైలిలో విచారించారు. అసలు విషయం బయటపెట్టారు.
ప్రియుడితో కలిసి.. పథకం ప్రకారం..
రవీందర్ సింగ్ భార్య మణిదీప్ కౌర్‌కు అమృత్సర్ జిల్లాలోని గురుద్వారా సాహిబ్ గ్రామానికి చెందిన జస్మిత్ సింగ్‌తో వివాహేతర సంబంధం ఉంది. అయితే వారికి అత్తమామలే అడ్డుగా ఉన్నారని భావించింది మణిదీప్ కౌర్. పథకం ప్రకారం వారిద్దరినీ హతమార్చాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. శనివారం రాత్రి రవీందర్ సింగ్ బయటకు వెళ్లగానే జస్మిత్సింగ్కు ఫోన్‌చేసి రమ్మని సమాచారమిచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మంజీత్ సింగ్, ఆయన భార్యను కత్తితో పొడిచి చంపారు. పోలీసులకు ఆధారాలు చిక్కకుండా మృతదేహాలకు నిప్పంటించి కాల్చేశారు.
పోలీసులను నమ్మించేందుకు..
దుండగులే ఈ పని చేశారని పోలీసులను నమ్మించేందుకు.. ఇంట్లోని 19 తులాల బంగారం, రూ. 45వేలు నగదును జస్మిత్ సింగ్‌కు ఇచ్చి పంపించింది మణిదీప్ కౌర్. దర్యాప్తు అనంతరం మణిదీప్ కౌర్, జస్మిత్సింగ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఓ కత్తి, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.
అంతేకాక జస్మిత్‌సింగ్ వేరేచోట దొంగిలించిన 15 తులాల బంగారాన్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: సామూహిక అత్యాచారం చేసి.. ఆపై బండరాయితో తలపై..