Punjab congress result: మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్... సీఎం చరణ్‌జీత్ సింగ్.... కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ.... కాంగ్రెస్‌ను పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతీసిన త్రిమూర్తులు! పార్టీతో పొసగక సీఎం పీఠం వదులుకొని.. వేరు కుంపటి పెట్టి అమరీందర్ పరోక్షంగా దెబ్బకొడితే.. సిద్ధూ, చన్నీల మధ్య రగడ కాంగ్రెస్‌ను నిలువునా ముంచేసింది.
Punjab congress Sidhu
'కాంగ్రెస్‌ను కాంగ్రెస్ తప్ప ఎవరూ ఓడించలేరు'.. ఎన్నికలకు ముందు ఆ పార్టీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్య ఇది. ఫలితాలు తేలేసరికి ఇదే నిజమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీని విపక్షాల కంటే.. అంతర్గత కలహాలు, అసమ్మతులే దెబ్బతీశాయి. సిద్ధూ, సీఎం చరణ్‌జీత్‌సింగ్ చన్నీ శిబిరాల మధ్య విభేదాలే ఓటమికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడం ఫలితాలపై ప్రభావం చూపింది.
అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత సీఎం కుర్చీ తనకు వస్తుందని సిద్ధూ భావించారు. అయితే, చన్నీని కాంగ్రెస్ తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అధిష్ఠానం నిర్ణయాన్ని సమ్మతించినట్లు సిద్ధూ ప్రకటించినా.. తనకు సీఎం పదవి దక్కకపోవడంపై గుర్రుగా ఉన్నారు. పలు వేదికల నుంచి బహిరంగంగా అసమ్మతి వ్యాఖ్యలు చేశారు. సీఎంను గద్దె దించే సత్తా నాకు ఉందని హెచ్చరించారు. 'నా దారి రహదారి' అన్న చందాన సిద్ధూ వ్యవహరించారు. పార్టీలోని ఇతర నేతలను కలుపుకొని పోలేదు.
ఈ కీచులాటలన్నీ ఎన్నికలకు ముందే జరిగాయి. దీంతో కాంగ్రెస్ నాయకత్వంలో ఐక్యత లేదని ప్రజలకు స్పష్టమైపోయింది. అప్పటికే ప్రజావ్యతిరేకతతో కొట్టుమిట్టాడుతున్న పార్టీ.. ప్రజల్లో మరింత బలహీనమైంది.
చన్నీ ధైర్యంతో...
అయితే, కాంగ్రెస్ మాత్రం చన్నీపై నమ్మకం ఉంచింది. సీఎం పదవి చేపట్టాక చన్నీ పనితీరు పట్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తమైంది. దీంతో ఎన్నికల్లో ఆయన ప్రభావం చూపిస్తారని భావించింది. చన్నీ సైతం ఎన్నికల్లో బాగానే పోరాడారు. సిద్ధూతో విభేదాలు ఉన్నా.. సంయమనం పాటించారు. అయితే, అమరీందర్ పాలనలో ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించలేకపోయారు. దీంతో కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి. గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేసినా నిరాశే మిగిలింది.
కెప్టెన్ వేరు కుంపటి...
అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌పై అసంతృప్తి పెరిగిపోయింది. సీ-ఓటర్ సర్వే ప్రకారం 60 శాతం మంది అమరీందర్ పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎంను మార్చింది. చన్నీ కాంగ్రెస్‌ను గెలిపిస్తారని భావించింది. అయితే, గద్దె దిగిన కెప్టెన్.. కాంగ్రెస్‌ను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. పంజాబ్ లోక్‌కాంగ్రెస్ పేరుతో కొత్తపార్టీ పెట్టి.. ఓట్లు చీల్చారు. దీంతో కాంగ్రెస్‌కు దెబ్బపడింది. ఓట్ల చీలిక పరోక్షంగా ఆప్ విజయానికి దోహదపడింది.
స్వయంగా మునిగిపోయారు..
ఈ ముగ్గురు దిగ్గజ నేతల అంతర్గత కుమ్ములాటలు, గిల్లిగజ్జాలు... కాంగ్రెస్ పార్టీనే కాకుండా... వారిని వ్యక్తిగతంగానూ దెబ్బతీశాయి. అమరీందర్ సింగ్ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. చన్నీ, సిద్ధూ సైతం తమ తమ స్థానాల్లో పరాజయం చవిచూశారు.
పంజాబ్ రాజకీయ భవిష్యత్ ఎలా
- పంజాబ్‌లో తాజా ఫలితాలు రాష్ట్రంలో సరికొత్త చరిత్రకు నాంది పలకనున్నాయి. తొలిసారి అకాలీదళ్, కాంగ్రెస్సేతర ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరనుంది.
- ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శిరోమణి అకాలీదళ్ కురువృద్ధుడు ప్రకాశ్ సింగ్ బాదల్ సైతం తన స్థానంలో వెనుకంజలో ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ ఓడిపోయారు. పార్టీ సైతం ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదు.
- ఇక, ఆప్‌కు ఇది నూతన శకంగానే చెప్పుకోవచ్చు. దిల్లీ మోడల్‌తో బరిలోకి దిగి.. పంజాబ్‌ను దక్కించుకున్న కేజ్రీ పార్టీ.. రాష్ట్రంలో భవిష్యత్‌లోనూ కీలకంగా మారే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: పాపం కాంగ్రెస్.. యూపీలో 'సింగిల్ సీటు' కోసం ఆపసోపాలు!