సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా డ్రగ్స్ సరఫరాదారుల పనిబట్టారు పంజాబ్ పోలీసులు. ఫరీద్‌కోట్‌లో భారీ స్థాయిలో సోదాలు నిర్వహించి.. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
కొద్దిరోజులుగా పంజాబ్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇద్దరు మహిళలు డ్రగ్స్‌ను పొడి చేసి, పొట్లాలు కట్టడం అందులో కనిపిస్తోంది. మాదక ద్రవ్యాల కట్టడికి తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసుల దృష్టిలో ఈ వీడియో పడింది. అందులో కనిపిస్తున్న మహిళలు ఎవరా అని వారు ఆరా తీశారు. వారిలో ఓ మహిళ.. కొట్కాపురాలోని ఇందిరా కాలనీలో ఉండే కాంగ్రెస్ కౌన్సిలర్ అత్త అని గుర్తించారు. అదే విధంగా మరో మహిళ వివరాల్నీ సంపాదించారు.
ఫరీద్కోట్ ఎస్ఎస్పీ అవనీత్ కౌర్ సిద్ధూ నేతృత్వంలో దాదాపు 200 మంది పోలీసులతో కూడిన బృందం.. కొట్కాపురాలో మెరుపు దాడి చేసింది. అనుమానితుల ఇళ్లలో సోదాలు జరిపింది. డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. అయితే.. ఎంత మొత్తంలో మాదక ద్రవ్యాలు దొరికాయన్న విషయాన్ని తర్వాత ప్రకటిస్తామని పోలీసులు చెప్పారు.