సెల్ టవర్లను ధ్వంసం చేయొద్దంటూ పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ చేసిన విజ్ఞప్తిని రైతులు పట్టించుకోవడం లేదు. ఒక్క రోజు వ్యవధిలో మరో 176 టవర్లపై దాడులు జరిపారు. దీంతో పంజాబ్లో శిథిలమైన టవర్ల సంఖ్య 1,411 కి పెరిగింది. ఇందులో జియోతో పాటు ఇతర సంస్థలకు చెందిన టవర్లున్నాయి, టెలికాం పరిశ్రమకు చెందిన సుదుపాయ కేంద్రాలు కూడా ధ్వంసమయ్యాయి.
రైతుల నుంచి ఆహార ధాన్యాలను ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీకి చెందిన సంస్థలు కొనుగోలు చేయవు. కానీ కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలు కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చుతాయనే ఉద్దేశంతో ఆయా సంస్థలనే లక్ష్యంగా చేసుకున్నారు రైతులు.
సెల్ టవర్లను ధ్వంసం చేసే సమయంలో రైతులను ఆపేందుకు యత్నించిన సైట్ మేనేజర్లపైనా దాడులు జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
టీఏఐపీఏ అభ్యర్థన..
టెలికాం టవర్లపై దాడులను ఆపాలంటూ.. టవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్(టీఏఐపీఏ) ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ దాడుల వల్ల సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది.
సీఎం ప్రకటన..
ఈ నేపథ్యంలో స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రంగంలోకి దిగారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు గత నాలుగు నెలల మాదిరే ఆందోళన చేయాలని విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగా, ఎటువంటి ఆస్తులు ధ్వంసం చేయకుండా పాల్గొనాలని అన్నదాతలను కోరారు.
రైతులు తమ లక్ష్య సాధనకు గత నాలుగు నెలలుగా ఏదైతే క్రమశిక్షణ చూపారో, దానినే కొనసాగించాలి. దయచేసి ఎటువంటి చట్ట వ్యతిరేక చర్యలకు ఉపక్రమించవద్దు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. కరోనా సంక్షోభం సమయంలో టవర్లను ధ్వంసం చేస్తే ఆ ప్రభావం సాధారణ ప్రజలపై పడ్తుంది. ఇంటి దగ్గర నుంచి పని చేసే ఉద్యోగులకు, విద్యార్థుల ఆన్లైన్ క్లాసులకు విఘాతం కలుగుతుంది. దీని వల్ల పంజాబ్ రైతులకు ఏమి లాభం లేదు.
-అమరీందర్ సింగ్, పంజాబ్ సీఎం.
ఇదీ చదవండి: ఆ చిన్నారి లేఖకు ప్రధాని స్పందన