Punjab assembly polls 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో కూటమిలో సీట్ల పంపకాన్ని పూర్తి చేసింది భాజపా. ఈ ఎన్నికల్లో 65 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌కు 37, శిరోమణి అకాలీ దళ్(సంయుక్త్)కు 15 సీట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ మేరకు కూటమి పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు వెల్లడించారు.
పంజాబ్‌లోని ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల నేతలతో దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో సమావేశమైన తర్వాత ఈ ప్రకటన చేశారు నడ్డా. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కెప్టెన్ అమరీందర్ సింగ్, సర్దార్ సుఖ్‌దేవ్ సింగ్ దిండ్సా హాజరయ్యారు.
" ప్రస్తుతం పంజాబ్‌పై ప్రత్యేక దృష్టి అవసరం. అందుకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మెరుగైన సహకారం అవసరం. సీట్ల పంపకంపై కుదిరిన ఒప్పందాన్ని తెలియజేస్తున్నా. భాజపా 65, పీఎల్సీ 37, ఎస్ఏడీ 15 సీట్లలో పోటీ చేయనున్నాయి. "
- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు.
నవజ్యోత్ సింగ్ సిద్ధూపై కెప్టెన్ విమర్శలు..
ఈ సందర్భంగా మాట్లాడిన కెప్టెన్ అమరీందర్ సింగ్.. దేశ భద్రత, రాష్ట్ర సంక్షేమం కోసమే మూడు పార్టీలు కలిశాయన్నారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్నేహితుడని, అందుకే తన ప్రభుత్వంలో సిద్ధూను తిరిగి మంత్రిగా తీసుకోవాలని ఆ దేశం నుంచి తనకు సందేశం అందినట్లు గుర్తు చేసుకున్నారు.
" నా ప్రభుత్వం నుంచి సిద్ధూను తొలగించిన తర్వాత.. పాకిస్థాన్ ప్రధానికి ఆయన పాత స్నేహితుడని ఆ దేశం నుంచి నాకు ఒక సందేశం వచ్చింది. తన ప్రభుత్వంలోకి తిరిగి తీసుకుంటే కృతజ్ఞతతో ఉంటారని.. ఒకవేళ సరైన పనితీరు కనబరచకపోతే అప్పుడు తొలగించాలని అందులో ఉంది."
- కెప్టెన్ అమరీందర్ సింగ్, పీఎల్సీ పార్టీ అధినేత.
పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రివర్గం నుంచి సిద్ధూను తొలిగించారు కెప్టెన్. ఆ తర్వాత పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సిద్ధూను నియమించటాన్నీ వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఇరువురి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: పంజాబ్‌లో ఎవరి బలం ఎంత? అమరీందర్ మేజిక్ చేసేనా?
మాల్వా చిక్కితే పంజాబ్ దక్కినట్లే.. అన్ని పార్టీల గురి అక్కడే..!