ఉగ్రవాదుల కుటుంబసభ్యుల జీవితాలు ఎంతో కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా అందులోని ఆడవారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ప్రాణాలు విడిచిపెట్టాలని అనిపిస్తుంది. కానీ.. ఉగ్రవాది కూతురంటూ ఎన్ని విమర్శలు ఎదురైనా.. తల్లిదండ్రులిద్దరూ మరణించినా.. ఎన్ని కష్టాలు వచ్చినా.. వాటన్నిటినీ జయించి చదువుల్లో రాణిస్తోంది జమ్ముకశ్మీర్‌కు చెందిన ఇన్షా జహీరా. ఇటీవల విడుదల చేసిన ఇంటర్ బోర్డ్ పరీక్షల ఫలితాల్లో టాప్ మార్కులు సాధించి.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తొన్న ఇన్షాతో 'ఈటీవీ భారత్' ముచ్చటించింది.
ఇదీ ఆ బాలిక కథ
దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాకు చెందిన ఆ బాలిక పేరు ఇన్షా జహీరా. ఆమె తండ్రి జహీద్ అహ్మద్ లోన్ ఒక ఉగ్రవాది. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు జరిగిన కాల్పుల్లో మృతిచెందాడు. ఆయన మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో ఇన్షా తల్లి చనిపోయింది. పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల.. సొంత ఇంటిని వదిలి వేరే చోటకు వెళ్లి ఆమె చదువుకోవాల్సింది. ఎన్నో అవమానాలు, తల్లిదండ్రులు చనిపోయారన్న బాధ తట్టుకుని మరీ ఆ బాలిక చదువులో రాణిస్తోంది. ఈ నెల 8న.. జమ్ముకశ్మీర్ ఎడ్యుకేషన్ బోర్డు విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో మొత్తం 500 మార్కులకు 427 తెచ్చుకుని అందరి ప్రశంసలు అందుకుంటోంది.
తాను ఇప్పుడు నీట్ కోసం సిద్ధమవుతున్నానని, డాక్టర్ కావాలన్నదే తన లక్ష్యమని ఈటీవీ భారత్‌కు తెలిపింది ఇన్షా. చదువులో రాణిస్తోన్న జహీరాను చూసి అమె తాతా-నానమ్మ, గ్రామస్థులంతా సంతోషిస్తున్నారు.
ఇదీ చూడండి: 'సోనియా, మమత క్షమాపణలు చెప్పాలి'