Pulwama Attack Terrorist: పుల్వామా దాడి నిందితుడు, పాకిస్థాన్ జాతీయుడు మొహియుద్దీన్ ఔరంగజేబ్ ఆలంగీర్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం టెర్రరిస్టుగా ప్రకటించిన 33వ వ్యక్తి ఆలంగీర్. జమ్ముకశ్మీర్‌లోని పుల్వమాలో 2019 ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ సిబ్బంది వెళ్తున్న బస్సును ఉగ్రవాదులు పేల్చివేశారు. ఆ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనకు ప్రతిస్పందనగా భారత సైనికులు పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడి జరిపారు.
కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించిన ఆలంగీర్(39) జనవరి 1, 1983న జన్మించాడు. పాకిస్థాన్‌లోని పంజాబ్ బహవల్పూర్ నివాసి అయిన అతడు జేఈఎమ్ సీనియర్ నాయకుడిగా ఉన్నాడు. అతడికి మఖ్తాబ్ అమీర్, ముజాహిద్ భాయ్, మహమ్మద్ భాయ్ అనే మూడు పేర్లు ఉన్నాయి. ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ తరఫున మన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించాడని, పుల్వామా దాడిలో ఆలంగీర్ ప్రమేయం ఉందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది.
ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్: ఆర్మీ, సీఆర్పీఎఫ్ బలగాల ఉమ్మడి ఆపరేషన్‌లో ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. సోపోర్‌కు చెందిన నిందితులు మజీద్, ఓవైసీ అహ్మద్ మీర్, షబ్బీర్ అహ్మద్‌లు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. వీరి నుంచి పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి: 'ఉక్రెయిన్‌కు భారత్ సాయంపై బైడెన్ ప్రశంసలు'