దిల్లీలో చెలరేగిన హింస తరువాత బుధవారం సమావేశమైన రైతు సంఘాల నాయకులు పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బడ్జెట్ డే సందర్భంగా ఫిబ్రవరి 1 న నిర్వహించాల్సిన పార్లమెంట్ మార్చ్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 30న దేశవ్యాప్తంగా ప్రజా కార్యక్రమాలు, నిరాహార దీక్షలు చేపడతామన్నారు. ఎర్రకోటలో విధ్వంసం విద్రోహ శక్తుల పనేనని.. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. రైతు ఉద్యమం మాత్రం కొనసాగుతుందన్నారు.
'దీప్ సిధ్ ఆర్ఎస్ఎస్ వ్యక్తి'
దీప్ సిధ్ ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని రైతు సంఘాల నాయకుడు దర్శన్ పాల్ ఆరోపించారు. సిధ్ భాజపా ఎంపీ సన్నీ దేఓల్కు సన్నిహితుడని తెలిపారు. రైతు ఉద్యమానికి సిధ్ మద్దతు ఇవ్వటంతో దేఓల్ అతడ్ని దూరం పెట్టారన్నారు.
'ఎర్రకోట ఘటన బాధాకరం'
మంగళవారం జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో రెండు లక్షలకు పైగా ట్రాక్టర్లు పాల్గొన్నాయని, లక్షల మంది రైతులు కదిలి వచ్చారని రైతు నాయకుడు బల్బీర్ సింగ్ తెలిపారు. 99.9శాతం ర్యాలీ ప్రశాంతంగా జరిగిందన్నారు. ఎర్రకోట ఘటన బాధాకరమని, ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తున్నామని స్వరాజ్ ఇండియా నాయకుడు యోగేంద్ర యాదవ్ తెలిపారు. దిల్లీ హింస వెనుక కొన్ని అసాంఘిక శక్తులు ఉన్నాయన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : 'ట్రాక్టర్ ర్యాలీ'తో రైతు ఉద్యమానికి బీటలు!