Property tax waiver mumbai: కొత్త సంవత్సరం వేళ ముంబయి వాసులకు తీపికబురు చెప్పింది మహారాష్ట్ర ప్రభుత్వం. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) పరిధిలోని 500 చదరపు అడుగుల్లోపు నివాస స్థలాలపై ఆస్తి పన్ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. పట్టణాభివృద్ధి శాఖతో శనివారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ నిర్ణయం తీసుకున్నారు.
Bmc property tax: ఆస్తి పన్ను రద్దు నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని అధికారులను ఠాక్రే ఆదేశించారు. ఈ నిర్ణయం వల్ల బీఎంసీ పరిధిలోని 16 లక్షల ఇళ్ల యజమానులకు లబ్ధి చేకూరుతుందని మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్నాథ్ శిండే పేర్కొన్నారు. దీంతో.. 2017 బీఎంసీ ఎన్నికలకు ముందు ముంబయి వాసులకు ఇచ్చిన ప్రధానమైన హామీని శివసేన ప్రభుత్వం నెరవేర్చిందని ఆయన చెప్పారు. వచ్చే నెలలో బీఎంసీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం.
రూ.468 కోట్ల నష్టం..
ఉద్ధవ్ ఠాక్రే శనివారం నిర్వహించిన ఈ వర్చువల్ సమావేశంలో.. శిండేతో పాటు ముంబయి డిస్ట్రిక్ట్ గార్డియన్ మంత్రి అస్లామ్ షేక్, ముంబయి సబర్బన్ డిస్ట్రిక్ట్ గార్డియన్ మంత్రి ఆదిత్య ఠాక్రే, మేయర్ కిశోరి పెడ్నేకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దేబాశిష్ చక్రవర్తి పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల బీఎంసీ రూ.468 కోట్ల ఆదాయం కోల్పోనుందని ఓ అధికారి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: న్యూ ఇయర్ కానుక- రైతుల ఖాతాల్లోకి రూ.20,900 కోట్లు
ఇదీ చూడండి: ఒక్కరోజులో 6 వేల సంస్థలకు విదేశీ విరాళాలు కట్!