దేశవ్యాప్తంగా డిజిటల్ సాక్షరత ప్రోత్సాహానికి ప్రజా ఉద్యమం జరగాల్సిన ఆవశ్యకత ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఆ ఉద్యమాన్ని విద్యా సంస్థలు, సాంకేతిక సంస్థలు ముందుండి నడిపించాలని ఆయన పిలుపునిచ్చారు. 'ఆదిశంకర. డిజిటల్ అకాడెమీ'ని ఉప రాష్ట్రపతి నివాసం నుంచి ఆన్ లైన్ ద్వారా శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ బోధన, అభ్యసన పద్ధతిలో మార్పు తేవడంలో సాంకేతికత సరికొత్త అవకాశాలను కల్పిస్తోందన్నారు. తరగతి గదుల్లోని విద్యాభ్యాసాన్ని.. ఆన్లైన్ తరగతులను సమ్మిళితం చేసి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. కరోనా మహమ్మారితో వచ్చిన మార్పులతో కోట్ల మంది విద్యార్థులు తరగతి గదులకు దూరమవడం వల్ల ప్రపంచమంతా ఆన్లైన్ విద్యా విధానానికి మొగ్గు చూపాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు.
ప్రత్యక్ష విధానానికి ప్రత్యామ్నాయం లేదు..
కరోనా నుంచి బయటపడిన తర్వాత కూడా ఆన్లైన్ విధానానికే ఎక్కువ మంది మొగ్గు చూపే అవకాశం ఉందన్నారు. ఈ విధానంలో చాట్ గ్రూప్లు, వీడియో సమావేశాలు, పరస్పర సమాచార మార్పిడి, నిరంతర అనుసంధానతకు అవకాశాలున్నా తరగతి గదిలో.. గురువు ద్వారా ప్రత్యక్షంగా నేర్చుకునే విధానానికి ఇది పూర్తి ప్రత్యామ్నాయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో ఆదిశంకర ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ కె.ఆనంద్, శృంగేరి మఠం సీఈవో సి.ఆర్ గౌరీశంకర్, ఈద్రోనా లెర్నింగ్ డైరెక్టర్ చిత్ర తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'భారతీయులందరికీ టీకా అందేది అప్పుడే'