దేశంలోని కోర్టుల్లో 4.5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నట్లు వెలువడిన గణాంకాలు అర్థరహితమైనవని, ఈ విశ్లేషణ అనాలోచితమని తెలిపారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. ఇలాంటి తప్పుడు అంచనాల వల్ల భారత న్యాయవ్యవస్థ అసమర్థంగా మారిందన్న తప్పుడు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో జాప్యానికి కారణమైన వాటిల్లో 'ఉద్దేశపూర్వకంగా దాఖలు చేసే వ్యాజ్యాలు' కూడా ఓ కారణమని తెలిపారు.
ఏ సమాజంలోనైనా వివాదాలకు వివిధ కారణాలుంటాయని జస్టిస్ రమణ పేర్కొన్నారు. అందులో రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కారణాలు ప్రధానమైనవన్నారు. వివాదాల పరిష్కారానికి ఒక బలమైన వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా.. వివాద పరిష్కారంలో మధ్యవర్తితం అనుసరించిన మహాభారతాన్ని ఓ ఉదాహరణగా సూచించారు. భారత చరిత్రలో మధ్యవర్తిత్వం ఒక భాగమని, బ్రిటీష్ వ్యవస్థ రాకముందు వరకు తనదైన పాత్ర పోషించిందన్నారు న్యాయమూర్తి.
'భారత్-సింగపూర్ మధ్యవర్తిత్వ సదస్సు'లో పాల్గొన్న సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు జస్టిస్ ఎన్వీ రమణ.
"అనేక ఆసియా దేశాలు వివాదాల పరిష్కారానికి సుదీర్ఘమైన సహకార, స్నేహపూర్వక పరిష్కార సంప్రదాయాన్ని కలిగి ఉన్నాయి. గొప్ప భారతీయ ఇతిహాసం మహాభారతం.. వివాద పరిష్కారంలో మధ్యవర్తిత్వానికి సరైన ఉదాహరణ. పాండవులు, కౌరవుల మధ్య వివాద పరిష్కారానికి శ్రీకృష్ణుడు ప్రయత్నించాడు. మధ్యవర్తిత్వం విఫలమైతే ఏవిధమైన పరిణామాలు ఉంటాయో ఆనాటి పరిస్థితులను గుర్తుచేసుకుంటే అర్థమవుతుంది."
- జస్టిస్ ఎన్వీ రమణ, భారత ప్రధాన న్యాయమూర్తి.
భారత్లో ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాలను(ఏడీఆర్) పునరుద్ధరించేందుకు కొన్ని కారణాలు ఉన్నాయని, వాటిలో ఒకటి న్యాయ జాప్యానికి సంబంధించినదని తెలిపారు జస్టిస్ రమణ. పెండింగ్ అనే పదాన్ని ప్రతి కేసుకు ఆపాదించటం సరికాదని అభిప్రాయపడ్డారు. కేసు ఎంతకాలం గడిచిందనే దానిపై ఎటువంటి సూచన లేకుండా పెండింగ్లో ఉన్నట్లు పేర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న నమోదైన కేసును కూడా ఈరోజు పెండింగ్ అంటున్నారని తెలిపారు. ఇది సరైన విధానం కాదని స్పష్టం చేశారు.
విచారణలో జాప్యం అనేది కేవలం భారత్లోనే లేదని.. అది అన్ని దేశాల్లో ఉన్న క్లిష్టమైన సమస్యగా పేర్కొన్నారు న్యాయమూర్తి. అలాంటి పరిస్థితికి అనేక అంశాలు కారణమవుతాయన్నారు.
ఇదీ చూడండి: 'వివాద పరిష్కారాలలో రాజ్యాంగ సమానత్వం ఉండాలి'