తనను జైలు అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ.. మద్రాస్ హైకోర్టులో ఓ ఖైదీ హంగామా సృష్టించాడు. న్యాయమూర్తి ముందే బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు.
ఏం జరిగిందంటే..
తమిళనాడులోని వ్యాసర్పాడి ప్రాంతానికి చెందిన పాండియన్.. ఓ మర్డర్ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. మరో కేసు విచారణలో భాగంగా 4వ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవి ముందు అతడు హాజరయ్యాడు.

తనను జైలు అధికారులు వేధిస్తున్నారని న్యాయమూర్తికి చెప్పాడు పాండియన్. ఈ విషయమై తాను లేఖ రాస్తానని, సదరు అధికారులపై తగిన చర్య తీసుకోవాలని కోరాడు. అకస్మాత్తుగా బ్లేడ్ తీసి తన గొంతు కోసుకున్నాడు.
అనంతరం.. వెంటనే పోలీసులు అతడ్ని ఆసుపత్రికి తరలించారు. అన్ని రకాలుగా తనిఖీ చేసినప్పటికీ బ్లేడును పాండియన్ ఎలా తీసుకువచ్చాడన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జైలులోనే అతనికి ఎవరైనా ఈ బ్లేడ్ అందించారా? అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నారు.