ప్రతిపక్షాలే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ.. కుటుంబాలు నడిపే రాజకీయ పార్టీ కాదని.. దేశంలో ఉన్న ఏకైక పాన్ ఇండియా పార్టీ అన్నారు. రెండు లోక్‌సభ స్థానాలతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన పార్టీ.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 303 స్థానాలకు చేరిందన్నారు. చాలా రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా ఓట్లు సంపాదించిందని చెప్పారు. మంగళవారం.. దిల్లీలో భాజపా కేంద్ర కార్యాలయానికి పొడిగింపుగా నిర్మించిన నూతన భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రసగించిన మోదీ.. బీజేపీ చిన్న పార్టీ నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీల్లో ఒకటిగా ఎదిగిందన్నారు. పార్టీకే అంకితమైన కార్యకర్తలు, వారి త్యాగాల వల్లనే ఇది సాధ్యమైందని చెప్పారు.
ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పడమరకు బీజేపీ ఒక్కటే పాన్ ఇండియా పార్టీ అని మోదీ అన్నారు. బీజేపీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీల్లో ఒకటిగా కాకుండా అత్యంత భవిష్యత్తు ఉన్న పార్టీగా కూడా అవతరించిదని తెలిపారు. భారత్‌ను ఆధునిక దేశంగా, అభివృద్ది దేశంగాను తయారు చేయడమే బీజేపీ లక్షమన్నారు.
"మనం బలమైన రాజ్యాంగ వ్యవస్థలను కలిగి ఉన్నాం. అందుకే భారత్‌ను అడ్డుకునేందుకే రాజ్యాంగ వ్యవస్థలపై దాడి జరుగుతోంది. ఎజెన్సీలు చర్యలు తీసుకుంటే వాటిపైనా దాడి జరుగుతోంది. న్యాయస్థానాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కొన్ని పార్టీలు అవినీతిని రక్షించాలని నినదిస్తున్నాయి." అని ప్రతిపక్షాలపై వ్యంగాస్త్రాలు సందించారు మోదీ.
1984 నాటి చీకటి దశను దేశం ఎప్పటికి మరిచిపోదన్నారు మోదీ. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించిందన్నారు. బీజేపీ పార్టీ టీవీ స్క్రీన్ నుంచి వార్తా పత్రికలు, ట్విటర్ హ్యాండిల్స్, యూటూబ్ చానళ్ల నుంచి రాలేదన్న మోదీ.. పార్టీ కార్యకర్తల కష్టం ఆధారంగా పురోగమించిందని తెలిపారు.
70 సంవత్సరాలలో మొదటి సారిగా అవినీతికి వ్యతిరేకంగా చర్యలు జరుగుతున్నాయని తెలిపిన మోదీ.. ఎప్పుడైతే ఆ చర్యలను ఎక్కువగా తీసుకుంటామో.. కొందరు వ్యక్తులు కలత చెందుతున్నారన్నారు. కోపాన్ని సైతం వెలిబుచ్చుతున్నారని పేర్కొన్నారు. అయిన కానీ అవినీతి వ్యతిరేకంగా చర్యలు మాత్రం ఆపేది లేదని సృష్టం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని నిరాధార ఆరోపణలు చేసిన వాటిని కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు.
దిల్లీలో భాజపా కేంద్ర కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి కొత్త భవనంలో కలియ తిరిగారు ప్రధాని మోదీ. నూతన కార్యాలయ ఆవిష్కరణకు ముందు ట్వీట్ చేసిన ప్రధాని.. ఈ కొత్త భవనం భాజపా కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపబోతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షత వహించగా.. పలువురు కేంద్ర మంత్రులు, భాజపా ముఖ్యనేతలు హాజరయ్యారు.