దేశంలో కరోనా పరిస్థితిపై వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రధాని నరేంద్రమోదీ. ప్రస్తుత పరిస్థితుల్లో టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్ విధానానికి మించిన ప్రత్యామ్నాయం లేదన్నారు మోదీ. కొవిడ్ రోగులకోసం ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కరోనా సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై స్థానిక అధికారులు దృష్టి సారించాలని సూచించారు మోదీ. కరోనా రోగులకు ఇచ్చే ప్రధాన ఔషధం రెమిడెసివిర్ సరఫరాపైనా సమీక్షించారు.
'మహమ్మారిపై విజయం తథ్యం'
కొవిడ్ మహమ్మారిపై గతేడాది విజయం సాధించామని.. అదే విధానాలను అనుసరిస్తూ మరింత వేగంగా, పరస్పర సహకారంతో ఈ ఏడాది కొవిడ్ మహమ్మారిపై విజయం సాధిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. వైద్యుల మార్గదర్శకాల మేరకు రెమిడెసివిర్ సహా ఇతర ఔషధాలను ఉపయోగించాలని సూచించారు. రెమిడెసివిర్ దుర్వినియోగం కాకుండా చూడాలని, బ్లాక్ మార్కెటింగ్‌లను నియంత్రించాలన్నారు. కొవిడ్ కేసులకు సంబంధించి రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్ ఉండాలని ప్రధాని సూచించారు.
ఇదీ చదవండి : 'మహా'లో కరోనా ఉగ్రరూపం- కొత్తగా 67,123 కేసులు