ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకానికి సంబంధించి 8వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మేఘాలయా, జమ్ముకశ్మీర్, అండమాన్- నికోబార్ ప్రాంతాలకు చెందిన పలువురు రైతులతో మాట్లాడారు.
'కనిపించని శత్రువుతో పోరాటం'
కరోనా వ్యాప్తిపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశం కనిపించని శత్రువుతో పోరాడుతోందని.. రెండో దశ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోందన్నారు. కరోనాపై పోరులో విజయం సాధిస్తామని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.
"ఈ మహమ్మారి ప్రపంచాన్ని పరీక్షిస్తోంది. గత కొంత కాలంగా ప్రజలు పడుతున్న బాధలను నేను అర్ధం చేసుకోగలను. మీ వంతు అవకాశం వచ్చినప్పుడు వ్యాక్సిన్లు తీసుకోండి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
స్థానికంగా ఉత్పత్తి, దిగుమతుల ద్వారా ఔషధాల పంపిణీని పెంచాము. ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు మరిన్ని ఆక్సిజన్ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించే వారిపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలి."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
పీఎం కిసాన్ పథకం ఇక నుంచి బంగాల్లో కూడా అమలు కానున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. దీని ద్వారా ఆ రాష్ట్రానికి చెందిన 7 లక్షలకు పైగా రైతులు లబ్ధిపొందుతారని తెలిపారు.
పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం.. ఏటా రైతు కుటుంబాలకు రూ.6000ను.. మూడు విడతల్లో రూ.2000 చొప్పున అందిస్తోంది. ఇప్పటివరకు రూ.1.15 లక్షల కోట్లను లబ్ధిదారులకు అందించామని కేంద్రం తెలిపింది.
ఇదీ చదవండి : ప్రజలకు మోదీ రంజాన్, అక్షయ తృతీయ శుభాకాంక్షలు