ఒడిశాలోని ఐఐఎం-సంబల్పుర్ శాశ్వత క్యాంపస్‌కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నేటి అంకుర పరిశ్రమలే రేపటి మల్టీనేషనల్ కంపెనీలుగా మారతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతోన్న సంస్కరణలు అంకుర సంస్థలకు కొత్త మార్గాలను చూపుతాయన్నారు.
" నేటి అంకుర పరిశ్రమలే రేపటి మల్టీనేషనల్ కంపెనీలు. దేశంలోని టైర్ 2, 3 నగరాల్లోనే ఎక్కువ అంకుర పరిశ్రమలు వెలువడ్డాయి. వ్యవసాయ రంగం నుంచి అంతరిక్ష రంగం వరకు చేపట్టిన సంస్కరణలు స్టార్టప్‌లకు కొత్త మార్గాలను చూపుతాయి. 2014 వరకు భారత్‌లో 13 ఐఐఎంలు ఉన్నాయి. ఇప్పుడు 20కి చేరుకున్నాయి. అంత భారీ సంఖ్యలో నైపుణ్యవంతులతో ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి బలం చేకూరనుంది. మేనేజ్మెంట్ రంగంలో కీలక మంత్రాలుగా ఆవిష్కరణ, సమగ్రతలు ఉన్నాయి. పని తీరులో మార్పుతో మేనేజ్మెంట్ విధానంలోనే మార్పు వచ్చింది. ప్రస్తుతం సహకార, వినూత్న, రూపాంతర మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాలి. "
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఈ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈశాన్య భారతంలో రాష్ట్రం విద్యకు కేంద్రంగా మారుతోందన్నారు సీఎం. విద్యా రంగం అభివృద్ధి కోసం రాష్ట్రం కృషి చేయటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.