శ్రేష్ఠమైన ప్రభుత్వానికి కులం, మతం, లింగ, జాతి, మతం అనే పట్టింపులు ఉండవని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అందరి అభివృద్ధి ధ్యేయంగా ఉంటుందని చెప్పారు. ఇదే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కేరళలో పలు కీలక ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా మోదీ శంకుస్థాపన చేశారు. కేరళ ప్రజలు ఈ అభివృద్ధి పథంలో కలిసి వస్తే మరెంతో సాధించవచ్చని అన్నారు. 320 కేవీ పుగులూరు-త్రిస్సూరు విద్యుత్తు ప్రాజెక్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. జాతికి అంకితమిచ్చారు. దేశంలో సౌర శక్తి వినియోగానికి ప్రాముఖ్యత పెరుగుతోందని అన్నారు.
"సౌరశక్తికి భారత్ అధిక ప్రాముఖ్యతను ఇస్తోంది. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాడడంలో సౌరశక్తి వినియోగం అత్యంత కీలకం. రైతులను సౌర రంగంతో అనుసంధానం చేసే ప్రక్రియ సిద్ధమవుతోంది. బ్లూ ఎకానమీలోనూ భారత్ పెట్టుబడులు పెడుతోంది. మత్స్యకారుల సంక్షేమం కోసం మేం ఎంతో చేశాం. నాణ్యమైన వసతులు సమకూర్చాం. ఇప్పుడు మత్స్యకారులు కూడా కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా లబ్ధి పొందగలుగుతారు."
--ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
పశ్చిమ ప్రాంత ప్రజలకు విద్యుత్ సరఫరా చేసే లక్ష్యంతో.. 320 కేవీ పుగులూరు-త్రిస్సూరు విద్యుత్తు ప్రాజెక్టును రూ.5,070 కోట్లతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:అక్షరాస్యతలో కేరళ మరో అరుదైన ఘనత