President Election: రాష్ట్రపతి ఎన్నికలో ఏకాభిప్రాయ సాధన కోసం భాజపా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ విపక్ష పార్టీల్లోని కీలక నేతలతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్‌తో రాజ్‌నాథ్ సింగ్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బీఎస్పీ అధినేత్రి మాయావతితోనూ ఆయన మాట్లాడినట్లు సమాచారం.
రాష్ట్రపతి ఎన్నికలో ఏకాభిప్రాయం సాధించే బాధ్యతలను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా రాజ్‌నాథ్‌కు ఇదివరకే అప్పగించింది భాజపా. ఖర్గే, మమత, అఖిలేశ్ సహా మరికొందరు విపక్ష నేతలతో కూడా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడినట్లు సమాచారం. వారంతా అభ్యర్థి ఎవరని అడిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ఎన్నికలో విపక్ష పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని 17 ప్రతిపక్ష పార్టీలు దిల్లీలో సమావేశమైన రోజే భాజపా ఈ సంప్రదింపులు జరపడం గమనార్హం.
రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కోసం మమతా బెనర్జీ నిర్వహించిన విపక్షాల సమావేశానికి బీజేడీ, తెరాస, ఆప్, వైసీపీ పార్టీల నేతలు హాజరుకాలేదు. దీంతో ఇది తమకు కలిసొచ్చే విషయమని భాజపా ఉత్సాహంతో ఉంది. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేదనేందుకు ఇది నిదర్శనమని ఆ పార్టీ భావిస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థి విజయానికి అవసరమైన 48శాతం ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు భాజపాకు ఉన్నాయి. బీజేడీ, వైసీపీ తమకు తప్పకుండా మద్దతిస్తాయని, విజయం నల్లేరుపై నడకేనని కమలం పార్టీ భావిస్తోంది. ఇతరులపై తమ ఆధిపత్యం చూపించుకోవడానికే కొందరు ప్రతిపక్ష నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారని భాజపా నేత, రాజ్యసభ ఎంపీ సుదాన్షు త్రివేది సెటైర్లు వేశారు. మమత భేటీపై పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
ఇదీ చదవండి: 'ఉమ్మడి అభ్యర్థి'పై విపక్షాల ఏకాభిప్రాయం.. పవార్‌ను ఒప్పించటంలో విఫలం!