President speech in Parliament: కరోనా వ్యాక్సినేషన్ సమయంలో భారతదేశ శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఏడాది కన్నా తక్కువ వ్యవధిలోనే 150 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎక్కువ డోసులు అందించిన దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉందని వివరించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించి ప్రసంగించిన ఆయన.. కొవిడ్ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వైద్యులు, శాస్త్రవేత్తలు, హెల్త్ కేర్ వర్కర్లు కలిసికట్టుగా పనిచేశారని కొనియాడారు.
జన్‌ధన్ ఖాతాలు-ఆధార్- మొబైల్ నెంబర్ అనుసంధానించి దేశ పౌరుల సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేసిందన్నారు రాష్ట్రపతి కోవింద్. బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా 44 కోట్ల మంది పౌరులు కరోనా సమయంలో ప్రత్యక్ష నగదు బదిలీ ప్రయోజనాలను పొందారని తెలిపారు.
"ఆయుష్మాన్ భారత్ కార్డులు పేదలకు ప్రయోజనం కలిగించాయి. జన ఔషధి కేంద్రాల్లో తక్కువ ధరకే పేదలకు ఔషధాలు పంపిణీ చేయడం ఆహ్వానించదగినది. కరోనా సమయంలో పేదలు ఆకలితో ఉండకుండా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి.. ప్రభుత్వం ఉచితంగా రేషన్ పంపిణీ చేసింది. 2022 మార్చి వరకు దీన్ని పొడిగించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార పంపిణీ పథకం."
-రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
నేతాజీ జయంతిని పురస్కరించుకొని ఈ ఏడాది రిపబ్లిక్ డే ఉత్సవాలను జనవరి 23నే ప్రారంభించిన విషయాన్ని రాష్ట్రపతి ప్రస్తావించారు. గతాన్ని దృష్టిలో ఉంచుకొని దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దడాన్ని తమ ప్రభుత్వం విశ్వసిస్తుందని చెప్పారు. అంబేడ్కర్ ఆదర్శాలను తమ ప్రభుత్వ మార్గదర్శక సూత్రాలుగా భావిస్తోందని చెప్పుకొచ్చారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: 'దేశ ఆర్థిక వృద్ధిపై ప్రపంచానికి భరోసా ఇచ్చే సమావేశాలివి'