ఈ ఏడాది 44 మంది ఉపాధ్యాయులకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ(best teachers 2021) అవార్డులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. వినూత్న బోధనా పద్దతులను అభివృద్ధి చేసి, పిల్లల బంగారు భవిష్యత్తును నిర్మించినందుకుగాను ఉత్తమ గురువులుగా సత్కరించారు.
"ప్రతి పిల్లవాడు ఓ ప్రత్యేకమైన ప్రతిభను కలిగి ఉంటాడు. వివిధ రకాల మానసిక స్థితులు, సామాజిక నేపథ్యాలతో ఉంటారు. పిల్లల అవసరాలు, ఆసక్తులు, సామార్థ్యాలకు అనుగుణంగా అన్ని కోణాల్లో తీర్చిదిద్దాల్సి ఉంటుంది. పిల్లల్లో చదువు పట్ల ఆసక్తిని రేకెత్తేలా చేయడం ఉపాధ్యాయుల కర్తవ్యం. సరైన ఉపాధ్యాయుడు తమ పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా ఎదిగేలా తోడ్పడతాడు. రాజ్యాంగ విలువల పట్ల గౌరవం పెంపొందేలా మన విద్యా వ్యవస్థ ఉండాలి."
-రాష్ట్రపతి, రామ్నాథ్ కోవింద్
ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకుంటాము. 1958 నుంచి ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి, గౌరవించటం ప్రారంభమైంది. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించారు.