President election 2022: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోని పార్టీ వర్గాలు, మిత్రపక్షాలను సమన్వయం చేసేందుకు భాజపా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. 14 మంది సభ్యులు గల ఈ కమిటీకి కేంద్ర మంత్రి గజేందర్ సింగ్ షెకావత్ నాయకత్వం వహించనున్నారు. భాజపా ప్రధాన కార్యదర్శులైన సీటీ రవి, వినోద్ తవాడే, తరుణ్ చుగ్ కూడా ఈ కమిటీలో భాగం కాగా.. రవి, వినోద్ కో-కన్వీనర్లుగా వ్యవహరించున్నారు. ఈ విషయాన్ని భాజపా శుక్రవారం వెల్లడించింది. వీరితో పాటు కేంద్రమంత్రులు జీ కిషన్ రెడ్డి, అశ్వినీ వైష్ణవ్, సర్బానంద్ సోనోవాల్, అర్జున్ మేఘ్వల్, భారతి పవార్ కూడా బృందంలో భాగమయ్యారు.
ప్రతిపక్షాలు కూడా..: ప్రతిపక్ష నేతలు కూడా రాష్ట్రపతి ఎన్నికలపై చర్చలు జరుపుతున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ అధ్యక్షతన పార్లమెంట్ ఆవరణలో ఈనెల 21న సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2.30కి మొదలయ్యే ఈ సమావేశానికి 17 పార్టీలకు చెందిన నేతలు హాజరుకానున్నారని సమాచారం.
మరోవైపు రాష్ట్రపతి ఎన్నికపై అధికార పక్షం ఇప్పటికే ప్రతిపక్షాలను సంప్రదించింది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్.. శరద్ పవార్, మమతా బెనర్జీ, నితీశ్ కుమార్, నవీన్ పట్నాయక్, ఫరూక్ అబ్దుల్లా సహా పలువురు నేతలతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఆధిక్యం ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన అభ్యర్థే రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. జులై 18న ఈ ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చూడండి : దీవిని తలపిస్తున్న స్కూల్.. చుట్టూ నీరు.. లోపల 150 మంది విద్యార్థులు