ప్రజల ప్రాణాలు కాపాడడానికి కృషిచేసిన 40 మందికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి జీవన్ రక్ష పతకాలను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ సోమవారం ఈ జాబితా విడుదల చేసింది. సర్వోత్తమ జీవన్ రక్ష, ఉత్తమ జీవన్ రక్ష, జీవన్ రక్ష అనే మూడు విభాగాల్లో ఈ అవార్డులను ప్రకటించింది. సర్వోత్తమ పతకం కేరళకు చెందిన 16 ఏళ్ల బాలుడు మహమ్మద్ ముహిషిన్‌కు మరణానంతరం లభించింది.
సముద్రంలో మునిగిపోతున్న ముగ్గురు సహచరులను తన ప్రాణాలను పణంగా పెట్టి రక్షించినందుకు ఆ బాలుడికి కేంద్ర ప్రభుత్వం మరణానంతరం ఈ ప్రతిష్ఠాత్మక పతకాన్ని ప్రకటించింది.
ఉత్తమ్ జీవన్ రక్ష పతకానికి 8 మందిని, జీవన్ రక్ష పతకానికి 31 మందిని ఎంపికచేసింది. జీవన్ రక్ష పతకానికి ఎంపికైన 8 మందిలో తెలంగాణకు చెందిన కొరిపల్లె సృజన్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కలగర్ల సాహితి ఉన్నారు. కొరిపల్లె సృజన్‌రెడ్డి 2019లో కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు మడిపల్లి గ్రామానికి చెందిన కార్మికులు ఓల్గల మల్లయ్య, మారపల్లి రవీందర్ పూడికతీత పనుల నిమిత్తం 60 అడుగుల లోతు బావిలోకి దిగి ఊపిరాడక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా రక్షించారు. రక్షించే క్రమంలో సిబ్బందిలో ఎవరూ సాహసించకపోవడంతో చివరకు ఆయనే తాడుపట్టుకొని బావిలోకి దిగి కార్మికులిద్దర్నీ పైకి తీసుకొచ్చారు.
పదహారేళ్లకే సాహసం
విశాఖ జిల్లా కొత్తకోట గ్రామానికి చెందిన 16 ఏళ్ల కలగర్ల సాహితి 2019 జులైలో సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు చిన్నారులను రక్షించినందుకు ఉత్తమ జీవన్ రక్ష పతకం దక్కించుకుంది. విహారయాత్రకు వచ్చినవారిలో ఇద్దరు చిన్నారులు సముద్రంలో మునిగిపోతుండటాన్ని చూసిన సాహితి వెంటనే సముద్రంలోకి దిగి వారిని కాపాడింది.