Oath taking ceremony of Yogi Adityanath: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీలు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధమీ, పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఆయా రాష్ట్రాల గవర్నర్‌లకు రాజీనామాలు సమర్పించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో హోలీ తరువాత కొత్త ప్రభుత్వం కొలువుతీరనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఉత్తర్‌ప్రదేశ్ తాత్కాలిక ముఖ్యమంత్రి ఆదివారం దిల్లీ వెళ్లి ఆ పార్టీ నాయకులను కలవనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను ఆహ్వానించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
శాసనసభను రద్దు చేయాల్సిందిగా గోవా మంత్రివర్గం సోమవారం గవర్నర్‌కు సిఫార్సు చేయాలని తీర్మానించింది.
పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ఈనెల 16న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు పంజాబ్ గవర్నర్ బన్వార్‌లాల్ పురోహిత్‌ను కలిసిన మాన్, ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు లేఖను అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అంగీకరించినట్లు భగవంత్ మాన్ వెల్లడించారు. ఈనెల 16 మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్ స్వగ్రామమైన ఖట్కర్ కలాన్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు మాన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఆహ్వానించినట్లు చెప్పారు. ఆప్ శాసనసభాపక్ష నేతగా భగవంత్ మాన్‌ను శుక్రవారమే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.
అటు మెజార్టీకి ఒక సీటు తక్కువ వచ్చిన గోవాలో మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ మద్దతు తీసుకోవడంపై భాజపా ఎమ్మెల్యేలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ మద్దతును వ్యతిరేకిస్తున్నారు. అయితే నిర్ణయాన్ని అధిష్టానమే తీసుకుంటుందని గోవా భాజపా తెలిపింది.
ఇదీ చూడండి: