Stomach pain for 9 months pregnant: రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమనే నిబంధనతో విద్యార్థులు ఉరుకులు పరుగుల మీద పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షలు రాసేవారిలో పెళ్లి అయిన మహిళలు కూడా ఉన్నారు. అయితే ఓ మహిళ 9 నెలల గర్భిణి కాగా.. తానూ పరీక్షకు హాజరైంది. పరీక్షా సమయానికి అందరినీ లోపలికి పంపారు. అంతా హడావుడిగా లోపలికి వెళ్లారు. ప్రశ్నాపత్రం తీసుకొని ప్రశాంతంగా పరీక్ష రాస్తున్న సమయంలో అనుకోకుండా ఆమెకు పురిటి నొప్పులు రావడం మొదలయ్యాయి.
అప్రమత్తమైన కళాశాల సిబ్బంది.. ఆమెను 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం పట్టణానికి చెందిన వివాహిత దేవి గతంలో ఇంటర్ బైపీసీ పూర్తి చేసి.. ఆ తరువాత వెటర్నరీ శిక్షణ పొందింది.. అనంతరం ఆమెకు వివాహం జరిగింది. వివాహం అయినా కూడా ఆమె చదువును కొనసాగించింది.
ప్రస్తుతం ఆమె వృత్తి విద్య కోర్సు చదువుతోంది. పరీక్షలు రానే వచ్చాయి. కానీ ఆమె పరీక్షా సమయానికి 9 నెలల గర్భంతో ఉంది పరీక్షలు రాయాలా వద్దా అనే ఆలోచనలో పడింది.. ఆ తరువాత ఏమనుకుందో ఏమో కానీ ఎలాగైనా పరీక్షలు రాయాలని అనుకుంది. అనుకున్నట్లుగానే పరీక్షలకు హాజరైంది. ఆమెకు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షా సెంటర్ కాగా.. పరీక్ష రాసేందుకు ఆమె భర్తతో హాజరైంది. పరీక్ష రాస్తుండగా కడుపులో నొప్పి రావడంతో గమనించిన సిబ్బంది.. ప్రిన్సిపల్ ఆకుల రాజు 108కి సమాచారం అందించారు. ఆ వాహనం వచ్చాక ఆమెను.. ఆ వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు.
హాస్పిటల్ నుంచి తిరిగి పరీక్ష రాసేందుకు కళాశాలకు వెళ్దామనుకుంది.. కానీ సూపరింటెండెంట్ వాగ్దేవి పరీక్షలు నిర్వహించి.. పురిటి నొప్పులు ప్రారంభమైనట్టు నిర్ధారించారు. తక్షణమే ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేయాలని చెప్పారు. ఆమెతో పాటు భర్త జనసేన నాయకుడు కరుణ కూడా వెంటే ఉండగా.. వైద్య సిబ్బంది చెప్పినట్లు అమెను దగ్గర ఉండి ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించే సమయంలో మహిళా పోలీసు, వైద్య సిబ్బంది ఉన్నారు.
ఇవీ చదవండి: