కరోనా మహమ్మారి(covid-19).. ఆ నవజాత శిశువులకు తల్లిప్రేమను దూరం చేసింది. అమ్మఒడిలో ఆడుకుంటూ పెరగాల్సిన వారికి పాలకోసం దిక్కులు చూసేలా చేసింది. కర్ణాటకలో జరిగిన వేర్వేరు ఘటనల్లో.. బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం ఇద్దరు తల్లులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
ఓ గర్భిణీకి కరోనా సోకగా.. వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె బిడ్డను కాపాడారు. ఈ ఘటన కర్ణాటక బెంగళూరులోని 'ద బౌరింగ్' ఆస్పత్రిలో జరిగింది. కానీ..!
అసలేమైంది?
దొడ్డబల్లాపుర(Doddaballapura)కు చెందిన అశ్విని అనే మహిళ.. 8 నెలల గర్భిణీ. ఇటీవల ఆమెకు కరోనా(covid-19) సోకినట్లు తేలింది. కొన్నిరోజులపాటు హోం ఐసోలేషన్లో ఉన్న ఆమెకు వ్యాధి మరింత తీవ్రం కాగా.. బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో అశ్విని పరిస్థితి విషమించింది. దాంతో వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేసి ప్రసవం చేశారు. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆమె.. మూడురోజుల తర్వాత కరోనా కాటు(covid-19)కు బలైంది. ప్రస్తుతం శిశువును వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అశ్విని మరణంతో తన మూడేళ్ల కూతురు సహా నవజాత శిశువూ తల్లిలేని వారుగా మిగిలారు.
"నా కూతురు పడిన బాధ మరెవ్వరూ అనుభవించకూడదు. ఇంట్లోనే ఉంండండి. బయటకు వెళ్లకండి" అని అశ్విని తల్లి చనిపోయిన తను కుమార్తెను గుర్తు చేసుకుంటూ విలపించింది.
మండ్యలో మరో ఘటన..
బిడ్డకు జన్మనిచ్చిన రెండు రోజుల అనంతరం.. ఓ తల్లి కరోనాతో(covid-19) కన్నుమూసింది. ఈ ఘటన మద్దూర్ తాలుకాలోని అరెతిప్పుర్ గ్రామంలో జరిగింది.
అరెతిప్పుర్ గ్రామానికి చెందిన గుణశ్రీ(33)కి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఓ కళాశాలలో ఆమె లెక్చరర్‌గా పని చేసేవారు. ఏడు నెలల గర్భంతో ఉన్న ఆమెకు ఇటీవల కరోనా సోకగా.. మండ్యలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో గుణశ్రీ పరిస్థితి విషమించింది. దాంతో వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. బిడ్డకు జన్మనిచ్చిన రెండు రోజుల తర్వాత ఆమె కన్నుమూసింది.
కర్ణాటకలో కరోనా కేసులు(karnataka corona cases) రోజురోజుకూ పెరుగుతున్నాయి. వైరస్ కట్టడికి రాష్ట్రంలో లాక్డౌన్ (karnataka lockdown) పకడ్బందీగా అమలు చేస్తోంది యడియూరప్ప(B.S. Yediyurappa) ప్రభుత్వం.
ఇదీ చూడండి: మాస్కు ధరించలేదని మేకులు దించారు!
ఇదీ చూడండి: Corona tests: కొవిడ్ కట్టడిలో వ్యూహరాహిత్యం