Prashant Kishor on 2024 election : 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనామోదం పొందాలంటే విపక్షాల కూటమికి సారథిగా విశ్వసనీయమైన వ్యక్తిని నిలబెట్టడం, ప్రజా ఉద్యమం తీసుకురావడం అవసరమని అభిప్రాయపడ్డారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. విపక్ష నేతలు.. వేర్వేరు పార్టీల నాయకులతో వరుస భేటీలు నిర్వహించినా పెద్దగా ఉపయోగం ఉండదని జోస్యం చెప్పారు. అసలు అలాంటి సమావేశాల్ని.. విపక్షాల ఐక్యత లేదా రాజకీయంగా సరికొత్త పరిణామంగా చూడరాదని సూచించారు. భాజపాను ఎదుర్కోవడమే ప్రధాన అజెండాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, బిహార్ సీఎం నీతీశ్ కుమార్, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఇతర విపక్ష నేతలతో ఇటీవల వరుస భేటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిశోర్.
భేటీలు ఓట్లు రాల్చవ్!
Opposition unity India : "అలాంటి సమావేశాలు, చర్చలు క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితుల్ని మార్చవు. నాకు ఎక్కువ అనుభవం లేదు. ఆయన(నీతీశ్) నాకంటే అనుభవజ్ఞుడు. కానీ.. కొందరు నేతలు భేటీ కావడాన్ని, కలిసి ప్రెస్ మీట్లు నిర్వహించడాన్ని నేను 'విపక్షాల ఐక్యత'లా లేదా 'రాజకీయంగా సరికొత్త పరిణామం'గా చూడడం లేదు. ప్రజల్లో ఉద్యమస్ఫూర్తి తీసుకొచ్చి, వారిలో ఓ బలమైన అభిప్రాయం కలిగేలా చేసి, భాజపాకు మెరుగైన ప్రత్యామ్నాయం అని జనానికి నమ్మకం కలిగించే విశ్వసనీయ వ్యక్తిని కూటమికి సారథిగా నిలబెడితే తప్ప.. ప్రజలు మీకు(విపక్ష కూటమికి) ఓట్లు వేయరు" అని పట్నాలో ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు పీకే.
![kcr meets nitish kumar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16339879_nitish-kcr.jpeg)
తెరాస అధినేత కేసీఆర్ సహా మరికొందరు నేతలతో ఇటీవల జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ భేటీ కావడంపై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. "ఆయన(నీతీశ్) భాజపాతో కలిసి ఉండగా.. ఆ కూటమితో సన్నిహితంగా ఉన్న నేతల్ని కలిసేవారు. ఇప్పుడు ఆయన భాజపాను విడిచిపెట్టారు. అందుకే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న నేతలతో భేటీ అవుతున్నారు. దీని వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. నిజంగా విజయం సాధించాలంటే మీకు విశ్వసనీయత, ప్రజల నమ్మకం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం, ప్రజా ఉద్యమం అవసరం" అని అభిప్రాయపడ్డారు ఐప్యాక్ అధినేత పీకే.
కేసీఆర్ X మమత X నీతీశ్ X కేజ్రీవాల్?
2014 నుంచి కాంగ్రెస్ వరుస సంక్షోభాలతో సతమతమవుతోంది. భాజపాను ఎదుర్కొనే విషయంలో ఎప్పటికప్పుడు తడబడుతోంది. కాంగ్రెస్ వైఫల్యాల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ యునైటెడ్, తెలంగాణ రాష్ట్ర సమితి, ఆమ్ఆద్మీ పార్టీ దూకుడు పెంచాయి. భాజపాకు అసలు సిసలైన ప్రత్యామ్నాయం మేమే కాగలమంటూ మమతా బెనర్జీ, నీతీశ్ కుమార్, కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. విపక్షాల ఐక్యత కోసం యత్నిస్తున్నారు. వీరి ప్రయత్నాలు ఫలిస్తే.. ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. మమత, కేజ్రీవాల్, కేసీఆర్‌లో ఎవరు బెటర్ అని అడగ్గా.. "అన్ని పార్టీల్ని ఏకం చేయగల, అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడే.. ప్రధాన మంత్రి అభ్యర్థిగా సరైన వ్యక్తి" అని జవాబు ఇచ్చారు ప్రశాంత్ కిశోర్.
![prashant kishor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16339879_prashant-kishor.jpeg)
కాంగ్రెస్ గమనమెటు?
Prashant Kishor on Congress : భారత్ జోడో పేరిట కాంగ్రెస్ చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రపైనా తన మనోగతాన్ని వెల్లడించారు పీకే. భాజపా బలంగా ఉన్న రాష్ట్రాలపై మరింత దృష్టి పెడితే బాగుండేదని అన్నారు. "యాత్ర రూట్ చూస్తే.. భాజపా, ఆ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు, రాజకీయ కార్యకర్తల్ని ఏకం చేయడమే కాంగ్రెస్ లక్ష్యంగా కనిపిస్తోంది. భాజపా బలంగా ఉన్న రాష్ట్రాల్ని ప్రధానంగా చేసుకుని యాత్ర చేపట్టాల్సింది. కానీ.. భాజపా బలంగా లేని రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ యాత్ర ప్రధానంగా సాగుతోంది. యాత్ర అసలు లక్ష్యానికి ఇది విరుద్ధంగా కనిపిస్తోంది" అని అభిప్రాయపడ్డారు ప్రశాంత్ కిశోర్.
![rahul gandhi bharat jodo yatra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16339879_rahul.jpeg)
బిహార్‌లో నయా రాజకీయం
Prashant Kishor on Nitish Kumar : బిహార్ ముఖ్యమంత్రిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు పీకే. కూటములు మార్చినా అనేక ఏళ్లుగా సీఎం కుర్చీలో నీతీశ్ కొనసాగుతుండడాన్ని ప్రస్తావిస్తూ.. "ఫెవికాల్ ఆయన్ను బ్రాండ్ అంబాసిడర్‌ను చేసుకోవాలి. అది ఫెవికాల్ బాండ్, అస్సలు విడిపోదు" అని అన్నారు. గత నెలలో భాజపాతో జేడీయూ తెగదెంపులు చేసుకున్నా.. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి అలానే ఉందని విశ్లేషించారు. అది వచ్చే ఎన్నికల్లో కనిపిస్తుందని జోస్యం చెప్పారు పీకే. ప్రస్తుతం ఏడు పార్టీలు(జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ వామపక్షాలు) ఒకవైపు, భాజపా మరోవైపు ఉండగా.. రానున్న ఎన్నికల నాటికి ఈ రాజకీయ సమీకరణాలు మారిపోతాయని అంచనా వేశారు.