Prashant Kishor Jan Suraj Yatra : ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన సొంత రాష్ట్రమైన బిహార్లో 'జన్ సురాజ్' పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్ర వాయిదా పడింది. ఎడమ కాలికి గాయం కారణంగా ఆయన ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయనను ఒక నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారు. దీంతో పాదయాత్రను కొద్ది రోజులు పాటు వాయిదా వెేస్తున్నట్లు ప్రశాంత్ కిశోర్ తెలిపారు.
తాను త్వరగా కోలుకుంటే 15 రోజుల్లోనే తిరిగి జన్ సురాజ్ పాదయాత్రను ప్రారంభిస్తానని తెలిపారు ప్రశాంత్ కిషోర్. లేదంటే జూన్ 11 నుంచి మళ్లీ యాత్రను తిరిగి మొదలుపెడతానని సమస్తిపుర్ జిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. వాలిసాహ్లి ప్రాంతంలో యాత్ర ముగింపు తర్వాత ప్రశాంత్ కిషోర్ గాయంతో బాధపడ్డారు. దీంతో ఆయన వైద్యులను సంప్రదించగా.. ఎడమ కాలి లోపలి భాగం దెబ్బతిందని నిర్ధారించారు. ఆయనను 15 నుంచి 20 రోజులు విశ్రాంతి తీసుకోమని వారు సూచించారు.
"నాకు మరే ఇతర ఆరోగ్య సమస్యలు లేవు. పలు ప్రాంతాల్లో అధ్వానమైన రోడ్లపై సుమారు రోజుకు 20 నుంచి 25 కిలోమీటర్లు నడవడం వల్లే కాలి కండరాలపై భారం పడి నడవడానికి ఇబ్బందిగా మారింది. ఇది మానడానికి కనీసం 15-20 రోజుల విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారు. ఈ పాదయాత్రలో భాగంగా రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో తిరిగాను. మరికొన్ని ప్రాంతాల్లో తిరగాల్సి ఉంది. కాబట్టి కొంత కోలుకున్నాక తిరిగి జన్ సురాజ్ పాదయాత్రను ప్రారంభిస్తాను."
- ప్రశాంత్ కిషోర్, ఎన్నికల వ్యూహకర్త
ఇప్పటివరకు 2500 కి.మీలు..
2022 అక్టోబర్ 2 నుంచి జన్ సురాజ్ పాదయాత్ర ప్రారంభమైంది. అప్పటి నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న ఈ యాత్రలో భాగంగా అనేక మారుమూల గ్రామాల్లో పర్యటించారు ప్రశాంత్ కిశోర్. ఇప్పటివరకు సుమారు 2500 కిలోమీటర్ల కంటే ఎక్కువే నడిచారు. పశ్చిమ చంపారన్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర శివహార్, తూర్పు చంపారన్, గోపాల్‌గంజ్, సివాన్, సారణ్, వైశాలి జిల్లాల మీదుగా మే 11న సమస్తిపుర్ జిల్లాలోకి ప్రవేశించింది.
తొలిరోజే షాక్..
సరికొత్త రాజకీయ వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యమంటూ 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన ప్రశాంత్ కిశోర్ బృందానికి తొలిరోజే షాక్ తగిలింది. యాత్ర మొదటిరోజైన గాంధీ జయంతి నాడు పశ్చిమ చంపారణ్ జిల్లా బేతియాలో బహిరంగ సభా ప్రాంగణం జనం లేక బోసిపోయింది.