Pradhan Mantri Rashtriya Bal Puraskar 2022: ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారాలను పీఎం నరేంద్ర మోదీ ప్రదానం చేశారు. ఈ మేరకు అవార్డ్ గ్రహితలతో ముచ్చటించి, బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ సర్టిఫికేట్లను అందించారు. 2021, 2022 సంవత్సరాలకు ఈ అవార్డ్లను అందజేశారు.
ఈ సందర్భంగా స్థానిక ఉత్పత్తుల(వోకల్ ఫర్ లోకల్)కు ప్రాధాన్యం ఇవ్వాలని బాలలకు ప్రధాని సూచించారు. కేంద్రం ప్రవేశపెడుతున్న అన్ని విధానాలను యువతను దృష్టిలో ఉంచుకొనే తీసుకొస్తోందని చెప్పారు. భారత్కు చెందిన యువత.. విదేశాల్లోనూ ఉన్నతస్థాయికి చేరుకుంటున్నారని అన్నారు. ఆదివారం సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జరిగిన హాలోగ్రామ్ విగ్రహావిష్కరణ గురించి మాట్లాడిన మోదీ.. దేశమే తొలి ప్రాధాన్యమనే విషయాన్ని నేతాజీ నుంచి నేర్చుకోవచ్చని అన్నారు.
కరోనా టీకా పంపిణీలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని మోదీ పేర్కొన్నారు. ఇప్పటివరకు 4 కోట్ల మందికి పైగా చిన్నారులు టీకా తీసుకున్నారని వెల్లడించారు.
ఏంటీ బాల పురస్కారాలు?
దేశంలో ఐదేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు పీఎంఆర్బీపీ పురస్కారాలను ఇస్తారు. నూతన ఆవిష్కరణలు, సామాజిక సేవ, పాండిత్యం, క్రీడలు, సాంస్కృతిక కళలు, శౌర్యపరాక్రమాలు రంగాల్లో విజేతలకు ఈ బహుమతులు ప్రదానం చేస్తారు. ఈ ఏడాదికి 29 మంది పిల్లలు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో.. పిల్లలు, వారి తల్లిదండ్రులు, ఆయా జిల్లాల కలెక్టర్లు పాలు పంచుకున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: నేతాజీ మిస్టరీలో ట్విస్ట్... అస్థికలకు డీఎన్‌ఏ టెస్ట్ ఎందుకు చేయలేదు?