Using Adulterated Palm Oil in AP and Telangana : ఇంట్లో పోపు పెట్టాలన్నా, ఏ కూరైనా రుచిగా ఉండాలన్నా, గారె వేయించాలన్నా, అట్టు వేయాలన్నా వంట నూనెతోనే కదా. మరి ఆ నూనెలో నాణ్యత లేకపోతే? అనేక ప్రమాదకర వ్యాధులకు అదే ప్రధాన కారణమైతే? ఊహించుకుంటేనే వామ్మో అని అనిపిస్తోంది కదా. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా కల్తీ నూనె అమ్మకాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. లూజు విక్రయాలతో జనం ఆరోగ్యం గుల్ల అవుతోంది. కొన్ని రోజులుగా మార్కెట్లో నూనెల ధరలు పెరిగిపోవడంతో కల్తీరాయుళ్లకు కలిసొచ్చింది. ఎక్కువ మంది వినియోగించే పామాయిల్‌ను కల్తీ చేసి జనానికి అంటగడుతున్నారు.
మన తెలుగు రాష్ట్రాల్లో పామాయిల్ వినియోగం ఎక్కువ. అయితే కేంద్రం దీనిపై దిగుమతి సుంకాన్ని పెంచడంతో ధరలు బాగా పెరిగాయి. పామాయిల్ 910 గ్రాముల ప్యాకెట్ రూ.129 ఉండగా, లూజుగా కిలో రూ.145 వసూలు చేసి అమ్ముతున్నారు. పొద్దు తిరుగుడు నూనె ప్యాకెట్ రూ.135కాగా లూజుగా రూ.155కు, వేరుశనగ నూనె ప్యాకెట్ రూ.150 ఉండగా లూజుగా రూ.154కే అమ్ముతున్నారు. ఎక్కువ మంది వినియోగించే పామాయిల్లో తక్కువ ధరకు వచ్చే నూనెలను కలిపి కల్తీ చేసి టోకు వర్తకులు చిల్లర వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఏపీలోని నరసరావుపేటలో కొన్ని మిల్లుల్లో నాసిగా, తేమతో ఉన్న వేరుశనగ పప్పు, పత్తి గింజల నుంచి నూనె తీసి టోకు డీలర్లకు విక్రయిస్తున్నారు.
పామాయిల్‌తో పోలిస్తే కిలో రూ.20 నుంచి రూ.30 వరకు తక్కువ ఇస్తున్నారు. నరసరావుపేటలో ఓ వ్యాపారి గతంలో నాణ్యత తక్కువగా ఉన్న నూనె పీపాలను నెలకు 100 నుంచి 150 వరకు విక్రయించేవారు. ప్రస్తుతం దాదాపు 1000 నుంచి 1500 వరకు అమ్ముతున్నారు. నాసిరకం వేరుశనగ, పత్తిగింజల నూనెలు గుంటూరుకు దిగుమతవుతున్నాయి. వీటినే పామాయిల్లో కలిపేస్తున్నారు. కళాయిలో కల్తీ నూనె వేడి చేసి ఆహార పదార్థాలు వేయగానే అది పొంగి కిందకు పోతోంది. సాధారణంగా తిను బండారాలు నెల వరకు నిల్వ ఉంటాయి. కానీ కల్తీ నూనె వల్ల వారం రోజులకే నూనె వాసన వస్తుండటంతో తినుబండారాలను వెనక్కి ఇచ్చేస్తున్నారని ఓ వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు.
కల్తీ ఇలా : దాదాపు చిల్లర కొట్టు, అల్పాహార శాలలు, బజ్జీ బండ్లు, చిప్స్ తయారు చేసేవారిలో ఎక్కువగా ఈ నూనె వాడుతున్నారు. ఏపీలో కృష్ణపట్నం పోర్టు నుంచి గుంటూరుకు పామాయిల్ ఉన్న లారీ వస్తుంది. లారీ రాగానే నూనెను దుకాణంలోని ట్యాంక్‌లోకి పంపింగ్ చేస్తారు. అందులో నాసిరకం నూనెలు కలిపేస్తారు. ఆ కల్తీ ట్యాంకు నుంచి డైరెక్ట్‌గా వ్యాపారులకు విక్రయిస్తున్నారు. 16 టన్నుల పామాయిల్ వస్తే దాదాపు 3 టన్నుల నాసిరకం నూనెలు కలుపుతున్నట్లు తెలిసింది. కల్తీ అయ్యాక సుమారు 15 కిలోల డబ్బాల్లోకి నింపి విక్రయిస్తున్నారు.
ఈ కల్తీ నూనె వ్యాపారం సత్తెనపల్లి, తెనాలి, పిడుగురాళ్ల, చిలకలూరిపేట తదితర పట్టణాల్లోనూ సాగుతోంది. కిలోకు రూ.20 చొప్పున లెక్కించినా 3 టున్నులకు రూ.60 వేలు లాభంతో రోజుకు కనీసం రూ.లక్ష వరకు టోకు వ్యాపారి లబ్ధి పొందుతున్నారు. చిన్న హోటళ్లు, రోడ్డుపక్కన ఫుడ్‌స్టాళ్లు, మాంసాహార విక్రయశాలల వారు ఎక్కువగా ఈ నూనె కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో లూజుగా డబ్బాల్లో కొంటున్నారు. గుంటూరులోని ఓ వ్యాపారి రోజుకు టోకున 16 టన్నులు, రిటైల్‌లో 16 టన్నులు మొత్తంగా 32 టన్నుల వరకు కల్తీ విక్రయిస్తున్నారు.
మీరు వంట కోసం వాడే నూనె కల్తీదా? మంచిదా? - ఎలా తెలుసుకోవాలంటే? - HOW TO IDENTIFY ADULTERATED OIL
యాసిడ్‌తో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ - ఇది చూస్తే ఇంకెప్పుడూ బయట కొనరు